మా వల్లే యాదాద్రి ప్లాంట్​కు ఎన్జీటీ అనుమతులు: భట్టి విక్రమార్క

మా వల్లే యాదాద్రి ప్లాంట్​కు ఎన్జీటీ అనుమతులు: భట్టి విక్రమార్క
  •     డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్​ ప్లాంట్​కు కేంద్ర పర్యావరణ అనుమతులు రావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణాలపై ఫోకస్  పెట్టామని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ప్లాంట్ ను సందర్శించి సెక్రటేరియెట్​లో అధికారులతో రివ్యూలు జరిపి పనుల్లో వేగం పెంచాం. బీఆర్ఎస్​ ప్రభుత్వం 50 శాతం విదేశీ, 50 శాతం స్వదేశీ బొగ్గుతో ఉత్పత్తి చేస్తామని 2017 జూన్ 15న పర్యావరణ అనుమతులు పొందింది. కానీ, ఒప్పందానికి భిన్నంగా 100 శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్  ఉత్పత్తికి ఏర్పాటు చేసింది. మార్చిన టెక్నాలజీతో పర్యావరణం దెబ్బతింటుందని స్వచ్ఛంద సంస్థలు ఎన్జీటీకి  ఫిర్యాదు చేశాయి.  దీంతో టెక్నాలజీకి అనుగుణంగా అనుమతులు పొందాలంటూ 2022 సెప్టెంబర్ 30న ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్​ చొరవ చూపకపోవడంతో పనులు ఆగిపోయాయి’ అని భట్టి తెలిపారు. మారిన టెక్నాలజీకి, ఎన్జీటీ షరతులకు అనుగుణంగా అనుమతులు పొందేందుకు ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయించి రెండు నెలల్లోనే అనుమతులు సాధించామని చెప్పారు. విద్యుత్‌ రంగంపై  కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని, దీనిపై తాము చర్చకు సిద్ధమని మరో ప్రకటనలో సవాల్‌ విసిరారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.