
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేవలం 5 శాతం ఐఆర్ ఇవ్వడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇదేనా అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకోవడం అంటే ఇట్లనే ఉంటదా? అని నిలదీశారు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏందీ దారుణమని ఆయన ఫైర్ అయ్యారు. వెంటనే 20 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏలనూ వెంటనే క్లియర్ చేయాలన్నారు.
ఏడాదిగా పెండింగ్ పెట్టిన మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ‘‘పీఆర్సీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి బాగాలేదన్నారు. పీఆర్సీ గడువు పూర్తవ్వడానికి 6 నెలల ముందే కమిటీని ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకోవాల్సి ఉంటుంది. కానీ, గడువు పూర్తయ్యాక పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తున్నది. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఉద్యోగులెన్నడూ ఇంత తక్కువ ఐఆర్‌ను చూడలేదు. ఐదేండ్లలో పెరిగిన ధరలకు.. ప్రకటించిన ఐఆర్‌కు ఏ మాత్రం పొంతనే లేదు. ఈ ఐఆర్‌ను చూసి 2.75 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2 లక్షల మంది పెన్షనర్లు షాకయ్యారు’’ అని భట్టి పేర్కొన్నారు.