ఎల్ నినో పై కేటీఆర్ కు కనీస అవగాహన లేదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎల్ నినో పై కేటీఆర్ కు కనీస అవగాహన లేదు  : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •      పెద్ద చదువులు చదివిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది
  •     కాంగ్రెస్‍ కట్టిన ప్రాజెక్టులు ధృడంగా ఉన్నయ్‍.. బీఆర్‍ఎస్‍ కట్టిన మేడిగడ్డ ఎందుకు కూలిందో చెప్పాలే
  •     రాష్ట్రంలో పవర్‍ కట్‍ అనేదే లేదు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వరంగల్‍, వెలుగు : 'బీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍కు ఎల్‍నినోపై కనీస అవగాహన లేదు, పదేండ్ల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి బుధవారం గ్రేటర్ వరంగల్ పరిధిలో విద్యుత్‍ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 

అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ అమెరికాలో చదువుకున్న కేటీఆర్‍ 'ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‍ తెచ్చిన కరువు' అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‍రెడ్డి రాత్రికి రాత్రి వేలాది కిలోమీటర్ల దూరం ఉండే పశ్చిమ పసిపిక్‍ మహాసముద్రంలోకి వెళ్లి వేడి పుట్టించాడా.. అంటూ ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని, నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటారన్నారు. కాళేశ్వరం కంటే ఎగువన కాంగ్రెస్‍ హయాంలో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ గోదావరి వరదలను తట్టుకొని చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. అదే గోదావరి, అదే ఇసుక పునాది మీద కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తుంటే.. బీఆర్‍ఎస్‍ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ మూడేండ్లలో ఎందుకు కుంగిందో చెప్పాలని సవాల్ చేశారు. 

ఎల్‍నినోను ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ

ఎల్‍నినో ప్రతికూల ప్రభావాన్ని విద్యుత్‍ వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎన్‍పీడీసీఎల్‍ సీఎండీ కర్నాటి వరుణ్‍రెడ్డి అధ్యక్షతన విద్యుత్ భవన్ లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఎల్‍నినో ప్రభావంతో జల విద్యుత్‍ ఉత్పత్తి  పడిపోయిన క్రమంలో.. 7 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‍ అందించినట్లు చెప్పారు. ప్రజా బాట, పొలం బాట కార్యక్రమాలతో ఎన్‍పీడీసీఎల్‍ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందిస్తోందన్నారు. విద్యుత్‍ లైన్‍మెన్లు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు చాహత్‍ బాజ్‍పాయ్‍, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ టి.వెంకన్న, వరంగల్‍ డీఎఫ్‍ఓ నిఖిల పాల్గొన్నారు.