- డెమోను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్
హైదరాబాద్సిటీ,వెలుగు: రైలు ఎప్పుడొస్తది? టికెట్లు ఉన్నాయా? ప్లాట్‌ఫాం ఎక్కడుంది? ఇలాంటి డౌట్లన్నిటికీ సమాధానం చెప్పేందుకు దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ‘ఏఐ’ టెక్నాలజీని తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో పనిచేసే ‘భోలు మినీ’, ‘భోలు మాక్స్’ అనే స్మార్ట్ మెషీన్లను కాచిగూడ, మల్కాజిగిరి రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.
ఈ ఏఐ మెషీన్ల పనితీరును శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, వివిధ శాఖల ప్రధానాధిపతుల సమక్షంలో డెమో నిర్వహించారు. ఇవి మల్టీ లాంగ్వేజ్ (బహుభాషా) సిస్టమ్‌తో పనిచేస్తాయి. అంటే మనకు నచ్చిన భాషలో రైళ్ల టైమింగ్స్, సీట్ల లభ్యత వంటి వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
ప్రయాణికులకు సులభంగా, త్వరగా సమాచారం అందించడమే ఈ సిస్టమ్ లక్ష్యమని అధికారులు చెప్పారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా రైల్వే సేవలను ఆధునీకరిస్తున్నామని జీఎం సంజయ్ కుమార్ తెలిపారు. ఏఐ టెక్నాలజీతో ప్రయాణికుల కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
