భోపాల్ లో 90 డిగ్రీ ఓవర్ బ్రిడ్జి గుర్తుందా..? ఉండే ఉంటుంది... ఆ అద్భుతాన్ని ఎలా మర్చిపోతారులే...! ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ టాపిక్స్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ 90 డిగ్రీ బ్రిడ్జి. దుమారం రేపిన ఈ బ్రిడ్జి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ బ్రిడ్జి వివాదంలో సస్పెండ్ అయిన ఏడుగురు ఇంజినీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడమే ఇందుకు కారణం. సస్పెండ్ అయిన ఏడుగురిలో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు ఉండగా.. వారిలో ఇద్దరిని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆఫీసుకు బదిలీ చేసినట్లు సమాచారం.
మంత్రి రాకేష్ సింగ్ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రదేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంజనీర్లను తిరిగి విధుల్లో చేరినప్పటికీ, శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతోందని.. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
రూ. 18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆష్‌బాగ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి జూన్ 2025లో పూర్తయింది. దాని ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతుండగా.. బ్రిడ్జి యొక్క 90-డిగ్రీల మలుపునకు సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో కూడా బ్రిడ్జి ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో బ్రిడ్జి ప్రారంభానికి ముందే మూసివేసింది ప్రభుత్వం.
►ALSO READ | ఓడినా తగ్గని మొండితనం.. మాజీ ముఖ్యమంత్రి కాదు..హాట్ టాపిక్ గా మమతా X ప్రొఫైల్
ఈ క్రమంలో బ్రిడ్జి నిర్మాణానికి బాధ్యులైన ఇంజినీర్లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత బ్రిడ్జి 90 డిగ్రీ మలుపును సాంకేతికంగా మార్చాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఇంతలోనే సస్పెండ్ చేసిన ఇంజనీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
