రాయ్‌పూర్: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్‌మెస్సీ రాక సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన గందరగోళంపై ఇండియా మాజీ కెప్టెన్ బైచూంగ్ భూటియా నిరాశను వ్యక్తం చేశాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయన్నాడు. ‘మెస్సీ ఈవెంట్‌కు 80 వేల మంది ఫ్యాన్స్ వచ్చారని విన్నా. వారిని కట్టడి చేయడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. అందరూ మెస్సీని ప్రేమిస్తారు. కానీ నిజమైన అభిమానులు అతన్ని చూడలేకపోయారు.
ఇది చాలా దురదృష్టకరం. ఈ సంఘటన నుంచి గుణపాఠం నేర్చుకుని అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని భూటియా పేర్కొన్నాడు. మెస్సీ రావడం చాలా మంచిదే అయినా ప్రణాళిక ప్రకారం జరగకపోవడం దురదృష్టకరమన్నాడు. ఈవెంట్‌తో సంబంధం లేని వీఐపీలు స్టేడియానికి రావడం వల్ల గందరగోళం తలెత్తిందన్నాడు. ప్రస్తుతానికి ఇండియాలో ఫుట్‌బాల్ పరిస్థితి ఆశాజనకంగా లేదన్నాడు.
భవిష్యత్‌లో ఇది సర్దుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. చత్తీస్‌గఢ్‌లో జరిగిన బస్తర్ ఒలింపిక్ ఈవెంట్‌ను భూటియా ప్రశంసించాడు. ముఖ్యంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో యువతను క్రీడలతో అనుసంధానించడానికి ఇదో మంచి కార్యక్రమం అని కొనియాడాడు. మరోవైపు కోల్‌కతా సంఘటనను దృష్టిలో పెట్టుకుని మెస్సీ ముంబై పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, మెటల్ కాయిన్స్‌ను అనుమతించడం లేదు.
