బీహార్ సీఎం కీలక నిర్ణయం .. 1.78లక్షల టీచర్‌ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు

 బీహార్ సీఎం కీలక నిర్ణయం ..   1.78లక్షల టీచర్‌ పోస్టులకు ఏ రాష్ట్రం వారైనా అప్లై చేసుకోవచ్చు

బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో  ఖాళీగా ఉన్న 1.78 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ ఉద్యోగాలకు ఏ రాష్ట్రం లోని వారైనా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు.  ఈ మేరకు నితీశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్‌ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. అయితే, తాజాగా కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మే 2న బిహార్‌ మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  

మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్‌ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.   ఈ ఏడాది చివరి నాటికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.