షేక్‌పురా(బిహార్): బిహార్‌లోని ప్రభుత్వ బంగ్లా వివాదంపై ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో నడుస్తున్నది రాచరికం కాదని, ప్రజాస్వామ్యమని స్పష్టం చేశారు. మంగళవారం షేక్‌పురాలో జరిగిన ‘సహయోగ్ క్యాంప్’లో సీఎం మాట్లాడుతూ కొంతమంది తల్లికి ఒక ఇల్లు, కొడుక్కి మరో ఇల్లు కావాలని కోరుకుంటున్నారని, ప్రభుత్వ బంగ్లాలు ఎవరికీ వారసత్వంగా రావని ఎద్దేవా చేశారు.
మాజీ సీఎం రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్ వేర్వేరు ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం నితీష్ కుమార్ పదవి నుంచి తప్పుకోగానే నివాసాన్ని ఖాళీ చేసి ఆదర్శంగా నిలిచారని, పార్టీ ఆదేశిస్తే తాను కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పదవి నుంచి తప్పుకుంటానని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు, రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, నేరస్తులలను అణచివేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన తేల్చి చెప్పారు.
