‘అగ్నిప‌థ్‌’ ఎఫెక్ట్: నిర‌స‌న‌ల మ‌ధ్య చిక్కుకున్న స్కూల్ బ‌స్‌

‘అగ్నిప‌థ్‌’ ఎఫెక్ట్: నిర‌స‌న‌ల మ‌ధ్య చిక్కుకున్న స్కూల్ బ‌స్‌

ప‌ట్నా : అగ్నిప‌థ్ రిక్రూట్‌మెంట్ స్కీంను వ్యతిరేకిస్తూ ఉద్యోగార్థుల నిర‌స‌న‌ల‌తో బీహార్ భ‌గ్గుమంది. ‘అగ్నిపథ్‌’పై ఆగ్రహంతో ద‌ర్భంగాలో ర‌హ‌దారుల‌ను నిర‌స‌న‌కారులు ముట్టడించ‌డంతో చిన్నారుల‌ను తీసుకువెళ్తున్న స్కూల్ బ‌స్ చిక్కుకుపోయింది. హింసాత్మక నిర‌స‌న‌ల మధ్య స్కూల్ బ‌స్ చిక్కుకోవ‌డంతో చిన్నారులు ఏడుస్తుండ‌గా టీచ‌ర్లు స‌ర్ధిచెబుతున్న ఘటన సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

పోలీసులు రంగ ప్రవేశం చేసి, స్కూల్ బ‌స్‌కు దారి ఇవ్వడంతో పిల్లలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ‘అగ్నిప‌థ్’పై బీహార్‌లో శుక్రవారం (జూన్ 18న) రెండోరోజూ నిర‌స‌న‌లు ఉధృతంగా కొన‌సాగాయి. బీజేపీ కార్యాల‌యానికి ఆందోళనకారులు నిప్పంటించారు. న‌వాడాలో గురువారం (జూన్ 16న) బీజేపీ కార్యాల‌యాన్ని ద‌గ్ధం చేశారు. 

నాలుగేండ్ల స‌ర్వీసు త‌ర్వాత అగ్నివీరుల్లో 25 శాతం మందినే ఉంచుతార‌ని, మిగిలిన వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగ‌నంపుతార‌ని అభ్యర్థుల్లో ఆందోళ‌న వ్యక్తమ‌వుతోంది. నాలుగేండ్ల త‌ర్వాత త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ప్రశ్నిస్తున్నారు. బీహార్‌లో ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ‌టంతో పాటు వాహ‌నాల‌కు నిప్పంటించి రైళ్లను ద‌గ్ధం చేయ‌డంతో తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. కుల్హారియ, స‌మ‌స్తీపూర్ రైల్వే స్టేష‌న్లలో నిర‌స‌న‌కారులు రైళ్లకు నిప్పంటించ‌డంతో పాటు విధ్వంసం సృష్టించారు.