13 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం.. గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ

13 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం.. గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ

ఆదిలాబాద్, వెలుగు: గిరిజన తండాలో 13 ఏళ్లుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్సి(బి) తండాకు చెందిన రైతుల సమస్యను పరిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా  శనివారం వారికి పట్టాలు అందజేశారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, సర్వే నంబర్లలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా పల్సి(బి) తండాకు చెందిన  9 మంది ఎస్టీ రైతులు పట్టాలు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా ప్రభుత్వ పథకాలు వారికి అందడంలేదు.

తాము ఎదుర్కొంటున్న సమస్యను ఇటీవల రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ పర్యవేక్షణలో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టి సమస్యను కొలిక్కి తెచ్చింది. మొత్తం 30 ఎకరాల భూమిని అర్హులైన రైతులకు కేటాయించారు. 9 మంది రైతులకు వారి సాగు విస్తీర్ణం ఆధారంగా 2 నుంచి 3 ఎకరాల వరకు పట్టాలను కలెక్టర్ స్వయంగా అందజేశారు. తమ దీర్ఘకాల సమస్యను పరిష్కరించిన ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంఆర్ వో రాజ్‌‌‌‌‌‌‌‌మోహన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.