నస్పూర్, నస్పూర్: ప్రిస్క్రిప్షన్ద్వారా డాక్టర్లు సూచించిన మందులనే మెడికల్ షాపుల నిర్వాహకులు అమ్మాలని కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో నిర్వహించిన ర్యాలీని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ చందన, ఈగల్ ఫోర్స్ సీఐ రవికుమార్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్ తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు అమ్మవద్దన్నారు. మందుల షాపుల నిర్వాహకులు సరైన అర్హత, అనుమతి తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ప్రారంభం
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 7 పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ ను డీఎంహెచ్వో అనిత, ఆస్పత్రి పర్యవేక్షకుడు వేదవ్యాస్, ఆర్ఎంవో భీష్మ, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఈ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు, మద్యం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మత్తుకు బానిసైన పిల్లలను తల్లిదండ్రులు డి అడిక్షన్ సెంటర్ కు తీసుకురావాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేశారు.
