జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 20న బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనుండగా, పార్టీ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వసంత శనివారం ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కాలేజీ, ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్డు ప్రాంతాల్లోని స్థలాలను పరిశీలించారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో పెద్దగా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని పేర్కొన్నారు.
