- హిట్లర్, హైడ్రా, హిల్ట్.. ఇవే కాంగ్రెస్ మార్క్ డెవలప్‌మెంట్
- అధికారులపై కోర్టు మొట్టికాయలు ప్రభుత్వ వైఫల్యమే
- చిట్‌చాట్‌లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘3హెచ్’ సంస్కృతితో అభివృద్ధి పూర్తిగా ‘హాల్ట్’ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. హిట్లర్ పోకడలు, హైడ్రా కూల్చివేతలు, హిల్ట్ నిర్ణయాలతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల్లా తాము క్షుద్ర పూజలను నమ్మమని, ప్రజల కోసం చేసే ప్రజాపూజలే తమకు బలమని స్పష్టం చేశారు. నేపాల్, బంగ్లాదేశ్‌లో జెన్‌జీ ఉద్యమం సక్సెస్ అయినంత మాత్రానా.. ఇక్కడ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో రాంచందర్ రావు చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలనా వ్యవస్థ కుప్పకూలిందన్నారు. ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్ తోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీనియర్ ఐఏఎస్ సందీప్‌కుమార్‌సుల్తానియా వంటి అధికారులపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. సల్కాం చెరువు ఆక్రమణలు, నాదర్ గుల్ భూ అక్రమాలపై ఆగస్టు 15 తర్వాత ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నాడు ఓకే.. నేడు తప్పుడు ప్రచారమా?
యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఇథనాల్ పెట్రోల్ కు అనుకూలంగా మాట్లాడారని గుర్తు చేశారు. అప్పట్లో దాన్ని సమర్థించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక క్యూర్ లోపాలపై ఈనెల 15 తర్వాత వర్క్ షాప్ నిర్వహిస్తామని చెప్పారు. సినిమా పిచ్చి ఉన్నోళ్లే జనసేనలో చేరుతున్నారని పేర్కొన్నారు. తక్కువ పోలింగ్ కావడం, క్యాండిడేట్ ఎంపికలో లేటు కావడంతోనే జాతీయ అధ్యక్షుడి సొంత సెగ్మెంట్‌లో ఓడిపోయినట్టు వెల్లడించారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కోరారు. సోమవారం ఆయన తన నివాసంలో స్థానిక యువతతో కలిసి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ నెల14న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద భారీ ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకో లేదా రాజకీయాలకో సంబంధించింది కాదని, వికసిత భారత్ సంకల్పంతో దేశ ఐక్యతను, శక్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు చేపడుతున్న కార్యక్రమమని స్పష్టం చేశారు. కుల, మత, రాజకీయ విభేదాలను పక్కనబెట్టి నగర ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మేం వాయు యాగం చేస్తం
రేవంత్ వరుణ యాగం చేస్తే.. వాళ్లు కొట్టుకుపోవాలని మేం వాయు యాగం చేస్తామని వ్యంగ్యంగా విమర్శించారు. సీఎం దగ్గరకే కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్, న్యాయ తదితర శాఖలు పెట్టుకున్నారనీ, నిజంగా ప్రేముంటే వాటిని జెన్‌జీ ఎమ్మెల్యేలకు అప్పగించాలని సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ నితిన్ నబీన్‌తో ఎంపీల పనితీరు, పార్లమెంటరీ సమావేశాల ప్రాముఖ్యతపై చర్చించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, పార్టీలోని సీనియర్లందరినీ భాగస్వాములను చేస్తూ ముందుకు సాగుతామని ఆయన వివరించారు.
