- రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జరగబోయే మున్సి పల్ ఎన్నికల్లో మేయర్, చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు అన్నారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న మొత్తం 2,996 వార్డులు, డివిజన్లలో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి బీ–ఫారాలు కూడా పంపామన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎంపీ, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీపై చూపిన విశ్వాసాన్ని తాము గౌరవిస్తున్నామని అన్నారు.
ఈ నమ్మకంతోనే ప్రతి మున్సిపల్ వార్డులోనూ బీజేపీ సింబల్ తో అభ్యర్థులు బ్యాలెట్ పేపర్లో ఉంటారని చెప్పారు. నల్గొండలో గతంలో మున్సిపల్ చైర్మన్‌గా, భువనగిరిలో వైస్ చైర్మన్‌గా గెలిచామని, ఖమ్మంలోనూ గట్టి పోటీ ఇచ్చామని గుర్తుచేశారు. ఈసారి మెజార్టీ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీని ధిక్కరిస్తే వేటు తప్పదు..
మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తి కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని రాంచందర్ రావు స్పష్టం చేశారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తున్నామని, టికెట్ దక్కని కార్యకర్తలు నిరాశ చెందవద్దని సూచించారు.
