- విద్యార్థుల భవిష్యత్తుతో రేవంత్ సర్కార్ చెలగాటం: ఏలేటి
- సీఎంకు విదేశీ టూర్లపై ఉన్న శ్రద్ధ విద్యపై లేదు
- కాలేజీలకు ప్రభుత్వం రూ.15 వేల కోట్లు బకాయి పడింది
- సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడ్తున్నరు
- పేరెంట్స్ అప్పు చేసి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఫైర్
- దీక్ష పోస్టర్ను ఆవిష్కరించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రేపు, ఎల్లుండి దీక్ష చేపడుతున్నట్టు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే దీక్ష మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు నేతృత్వంలో రెండు రోజుల పాటు జరిగే ఈ దీక్షలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొంటారని వెల్లడించారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పోస్టర్ను ఇతర నేతలతో కలిసి ఏలేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులకు పెట్టుబడుల పేరుతో విదేశీ టూర్లు చేయడంపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై లేదని విమర్శించారు. రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా శాఖకు కనీసం మంత్రిని నియమించుకోలేకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. బిహార్ లాంటి రాష్ట్రం విద్యకు 20 శాతం బడ్జెట్ కేటాయిస్తుంటే, తెలంగాణలో కేవలం 8 శాతమే కేటాయించడం శోచనీయమన్నారు.
ఫీజు బకాయిలివ్వాలి
ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం సుమారు రూ.15 వేల కోట్లు బకాయి పడటంతో కాలేజీ మేనేజ్మెంట్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఏలేటి ఆరోపించారు. దీంతో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక, పైచదువులకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ ఒంటిపై ఉన్న బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించిందని విమర్శించారు.
సర్కారీ బడులు శిథిలావస్థకు చేరాయని, కనీసం బాలికలకు మరుగుదొడ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పారు. పాత ప్రభుత్వ బకాయిలతో తమకు సంబంధం లేదన్నట్టు మాట్లాడటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ప్రజావ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నదని విమర్శించారు.
