దేశానికి ఒక్కటే జెండా.. అదే మన జాతీయ జెండా

దేశానికి ఒక్కటే జెండా.. అదే మన జాతీయ జెండా

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై బీజేపీ సీరియస్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దాదాపు 14 నెలల నిర్బంధం తర్వాత రీసెంట్‌‌గా విడుదలయ్యారు. తాజాగా ఆమె ఓ ప్రెస్ మీట్‌‌‌లో దేశ జెండా గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ‘మా రాష్ట్ర జెండాను తిరిగి పొందిన తర్వాతే జాతీయ జెండాను మేం ఎగరేస్తాం. రాజ్యాంగం అమలలో ఉన్నందునే రాష్ట్ర జెండాతోపాటు ఇక్కడ జాతీయ జెండాను ఎగరేస్తున్నాం. జమ్మూ కశ్మీర్ జెండా వల్లే మిగిలిన దేశంతో మేం అనుసంధానం అవుతున్నాం’ అని మెహబూబా చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.

మెహబూబా ముఫ్తీపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా కోరారు. ‘దేశ జెండాతోపాటు మాతృభూమి కోసం మా దేహంలోని ప్రతి రక్తపు బొట్టును చిందిస్తాం. జమ్మూ కశ్మీర్ మన దేశంలో అంతర్భాగం. అందుకే ఒక్క జెండానే మనం ఎగరేయాలి. అదే జాతీయ జెండా. కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టొద్దని మెహబూబా ముఫ్తీ లాంటి నేతలను మేం హెచ్చరిస్తున్నాం. ఇక్కడ శాంతియుత పరిస్థితులను, సోదరభావాన్ని చెడగొట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకోబోం. ఏదైనా అనుకోనిది జరిగితే తదుపరి పరిణామాలను ముఫ్తీ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని రవీందర్ రైనా పేర్కొన్నారు.