
హామీలను మరిచిన కేసీఆర్..
టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం
మేమే: ‘జన్ సంవాద్’ సభలో
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
మలిదశ ఉద్యమానికి సిద్ధంకండి
కేసీఆర్ ఫ్యామిలీ నుంచి
రాష్ట్రాన్ని కాపాడాలి: బండి సంజయ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే
అధికారం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అసమర్థ పాలనకు తోడు అవినీతి పాలన సాగుతుందంటే అది పక్కాగా తెలంగాణలోనేనని, అది టీఆర్ఎస్ సర్కారేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. గోదావరి నదిపై ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్ తీరును చూస్తే చాలా విచిత్రంగా ఉందని, ప్రాజెక్టుల్లో అవినీతి తప్ప, నీరు ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రూ. 45 వేల కోట్లతో కాళేశ్వరం కడుతున్నామని చెప్పి, దాన్ని రూ. 85 వేల కోట్లకు పెంచారంటే అందులో అవినీతి ఎంత పెరిగిందో అర్థమవుతుందని ఆయన దుయ్యబట్టారు. కరప్షన్‌లో రాష్ట్రం ముందు వరుసలో ఉందని ఆయన విమర్శించారు.
రెండోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నేషనల్ లెవల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల పార్టీ క్యాడర్ తో డిజిటల్ వేదికగా వర్చువల్ ర్యాలీలను నిర్వహిస్తోంది. ‘జన్ సంవాద్’ సభ పేరుతో రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్‌ను శనివారం చేపట్టింది. కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. రాష్ట్రంలో కడుతున్న ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి స్పష్టంగా కనిపస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల కోసం టీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు కట్టడంలేదని, కేవలం అవినీతి సొమ్ము కోసమే కడుతున్నదని మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో దక్షిణ తెలంగాణను కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో అతి తక్కువగా కరోనా టెస్టులు తెలంగాణలోనే జరుగుతున్నాయని, టీఆర్ఎస్ సర్కార్ కరోనా విషయంలో ఎలా వ్యవహరిస్తుందో జర్నలిస్టు మృతి తెలుపుతోందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయకపోవడంతో ఇక్కడి పేదలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఉజ్వల, జన్ ధన్, స్వచ్ఛ భారత్ లతో రాష్ట్రంలో లక్షలాది పేదలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.
కేసీఆర్..! హామీల అమలేది?
ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని జేపీ నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో 7 లక్షల డబులు బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం 50 వేల ఇండ్లు కూడా నిర్మించలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఎడ్యుకేషన్ సెక్టార్ పూర్తిగా అస్తవ్యస్తమైందన్నారు. హిందువులకు వ్యతిరేకంగా కేసీఆర్ మాట్లాడుతున్న తీరు ఆయనలోని అహంకారానికి నిదర్శనమన్నారు. హిందుగాళ్లు, బొందుగాళ్లు అని కేసీఆర్ అనడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేశం రూపురేఖలను మార్చే ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్యాకేజీని కూడా విమర్శించారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు.
సైనికులను అవమానించేలా రాహుల్ విమర్శ
గల్వాన్ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు, ముఖ్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు సైనికులను అవమానించేలా, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ తీరును ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్ ధరలు పెరిగాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది.. మరి మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు కూడా ధరలు పెంచాయని, కాంగ్రెస్ నాయకత్వం మాటను అక్కడి సీఎంలు వినడం లేదా అని నడ్డా ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిందన్నారు. కరోనా కట్టడిలో ప్రధాని మోడీ తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాలను ప్రపంచ దేశాలు మెచ్చుకున్నా.. దేశంలో కొందరు రాజకీయం చేశారన్నారు. దేశాభివృద్ధి కోసం మోడీ దగ్గర రోడ్ మ్యాప్ ఉందని, కానీ కాంగ్రెస్ మాత్రం పార్టీ కోసం రోడ్ మ్యాప్ చూసుకోవాలని నడ్డా ఎద్దేవా చేశారు. గల్వాన్‌లో మరణించిన సైనికులకు దేశమంతా నివాళులర్పిస్తోందని చెప్పారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులను అభినందించారు. డిజిటల్ వేదికగా తెలంగాణలోని లక్షలాది మం దిని కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.