V6 News

సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర: మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్

సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర: మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు: మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్ 
  • త్వరలో కార్పొరేషన్ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెక్యులర్ ఓట్లను అడ్డదారుల్లో తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్ గౌడ్ ఆరోపించారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌లు, నియోజకవర్గ కోఆర్డినేటర్లతో బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలు, మండల కో ఆర్డినేటర్ల నియామకాలపై పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్, ఏఐసీసీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రజాపాలన సాగుతోందన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం సాధారణ విషయం కాదని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. 2023 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ కావాలని, రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవడమే లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ప్రతి కార్యకర్త ధ్యేయం కావాలన్నారు. 

బీఎల్ఏల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు.. 
బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ) నియామకం, పనితీరు విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌ గౌడ్ స్పష్టం చేశారు. ఈరోజు నుంచే బీఎల్ఏ కార్యక్రమం మొదలుకావాలని, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు.

త్వరలో కార్పొరేషన్ పదవుల భర్తీ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యకర్తలు, నాయకులు తమ టైమ్‌‌‌‌‌‌‌‌లో 80 శాతం పార్టీ కోసం కేటాయించాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ నిర్మాణమే కర్తవ్యంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉంటేనే భవిష్యత్తులో విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.