టిప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పును తప్పుపట్టిన అస‌దుద్దీన్ ఓవైసీ

టిప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరు మార్పును తప్పుపట్టిన  అస‌దుద్దీన్ ఓవైసీ

టిప్పు సుల్తాన్ బీజేపీని చికాకు పెడుతున్నాడని, అందుకనే మైసూర్ పాలకుడి పేరు మీద ఉన్న రైలు పేరును బీజేపీ మార్చిందని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. కేంద్రం తీరును తప్పుబట్టిన ఆయన... టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చడంపై నిప్పులు చెరిగారు. టిప్పు సుల్తాన్ అంటే ఇష్టం లేకనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కానీ ఆ పార్టీ అతడి వారసత్వాన్ని ఎప్పటికీ చెరిపివేయలేదన్న ఆయన... బీజేపీ ప్రభుత్వం టిప్పు ఎక్స్‌ప్రెస్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చిందని అన్నారు. టిప్పుపై బీజేపీ భగ్గుమంది. ఎందుకంటే టిప్పు, బ్రిటీష్ ప్రభువులపై మూడు యుద్ధాలు చేశాడని చెప్పారు. అయితే రైలు పేరును బీజేపీ మార్చినా టిప్పు వారసత్వాన్ని ఎప్పటికీ తుడిచిపెట్టలేరని అస‌దుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. 

రైల్వేశాఖ మైసూర్ పాలకుడి పేరు మీద ఉన్న రైలు టిప్పు సూపర్‌ఫాస్ట్ పేరును వడయార్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. ఈ రైలు పేరు మార్పుపై కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగింది. సమాజంలో విద్వేషాలు పెంచేందుకు బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ రైలు పేరు మార్చాలంటూ మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా రైల్వే శాఖకు జూలైలో లేఖ రాయడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.  

అంతకు మునుపు బీజేపీని టార్గెట్ చేస్తూ అసదుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనివసించే ప్రతి ముస్లిం ఓపెన్ జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన అసద్... ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను వీధి కుక్కల కంటే హీనంగా చూస్తున్నారని ఆరోపించారు. యూపీలో మదర్సాలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారని గుర్తు చేశారు. గుజరాత్‌లో దాండియా వేడుకలపై రాళ్లు వేశారనే కారణంతో ముస్లిం యువకులను నడి రోడ్డు మీద పోలీసులు లాఠీలతో చితకబాదారని అన్నారు. వారిని కొడుతుంటే స్థానికులు చప్పట్లు కొడుతూ నిల్చున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.