- పార్టీ నేతలను ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ్ పాటిల్
- గతం వదిలేయండి.. భవిష్యత్ గురించి ఆలోచించాలని సూచన
- వ్యక్తులు కాదు.. పార్టీయే ముఖ్యం
- ఎవరైనా పార్టీ లైన్ దాటితే ఊరుకోమని వార్నింగ్
- బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్‌తో భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బీజేపీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై అధిష్టానం దృష్టి సారించింది. శనివారం హైదరాబాద్‌లో ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్.. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌తో సమావేశం నిర్వహించారు. ఇద్దరు అగ్ర నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తూనే.. గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అందరూ కలిసి పనిచేయాల్సిందేనని, లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుందని అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు సమాచారం. బండి, ఈటలను కలిసిన తర్వాత ఎంపీ ధర్మపురి అరవింద్‌తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘‘గతంలో ఏం జరిగిందో వదిలేయండి.. ఇప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించండి.
పార్టీ చెప్పినట్లు ఎవరైనా వినాల్సిందే.. లేదంటే వేరే పార్టీ నుంచి ఇతరులను తెచ్చుకుంటాం. పార్టీ లైన్ దాటితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థ ముఖ్యం. మనుషుల కంటే పార్టీయే సుప్రీం’’ అని స్పష్టం చేశారు. అనంతరం అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని బండి, ఈటల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది
పార్టీ మాట జవదాటను: బండి సంజయ్
‘‘పార్టీ ఆదేశమే నాకు శాసనం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. దానికోసం హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా’’ అని బండి సంజయ్ చెప్పినట్లు తెలిసింది. తనపై ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా.. తాను మాత్రం హైకమాండ్‌కు ఎవరిపైనా కంప్లైంట్ చేయలేదని గుర్తుచేశారు. ‘‘నన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు కూడా పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే బీజేపీ నా తల్లి లాంటిది. నా తల్లి నేర్పిన క్రమశిక్షణే నాకు శ్రీరామరక్ష. అమ్మ మాటను నేను ఎప్పటికీ జవదాటను’’ అని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.
