రాబోయే పది రోజులు ముంబై విడిచి వెళ్లొద్దు: బీఎంపీ మేయర్ ఎన్నిక వేళ కార్పొరేటర్లకు బీజేపీ ఆర్డర్

రాబోయే పది రోజులు ముంబై విడిచి వెళ్లొద్దు: బీఎంపీ మేయర్ ఎన్నిక వేళ కార్పొరేటర్లకు బీజేపీ ఆర్డర్

ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) మేయర్ ఎంపిక మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇటీవల జరిగిన బీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో 89 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ బీఎంసీ మేయర్ పీఠం అధిష్టించేందుకు కావాల్సిన 114 సీట్ల మేజిక్ ఫిగర్‎ను బీజేపీ అందుకోలేకపోయింది. దీంతో తన మిత్ర పక్షం శివసేన (షిండే) మద్దతు బీజేపీకి తప్పని సరైంది. 

బీజేపీ, శివసేన కూటమి కలిసి 118 సీట్లు గెలిచాయి. ఈ క్రమంలో షిండే తన 29 మంది కార్పొరేటర్లను రిసార్ట్‎కు తరలించారు. బీఎంసీ మేయర్ ఎన్నికపై నరాలు కొనసాగే ఉత్కంఠ కొనసాగుతోన్న వేళ కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు బీజేపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 10 రోజుల పాటు నగరం విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పార్టీ సీనియర్ నాయకులకు ముందుగానే తెలియజేయాలని కార్పొరేటర్లను ఆదేశించారు. 

బీఎంసీ మేయర్ ఎన్నికకు దాదాపు 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉండటంతో బీజేపీ కార్పొరేటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు మేయర్ పదవిపై బీజేపీ, శివసేన (షిండే) మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

బీఎంసీ మేయర్ పదవిని మొదటి సంవత్సరం శివసేనకు ఇవ్వాలని షిండే డిమాండ్ చేసినట్లు సమాచారం. జనవరి 23న శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే శతజయంతి ఉత్సవాలు జరుగుతాయని, మొదటి సంవత్సరంలోనే శివసేన మేయర్‌ను నియమించడం బాలాసాహెబ్‌కు నివాళిగా ఉపయోగపడుతుందని షిండే వర్గం వాదిస్తోందట. 

దీనికంటే ముందు ఐదేళ్ల పదవీకాలాన్ని బీజేపీ, శివసేన చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోవాలని షిండే ప్రతిపాదించగా ఇందుకు బీజేపీ నిరాకరించిందని సమాచారం. దీంతో మేయర్ పదవి మొదటి సంవత్సరం మాకే  ఇవ్వాలని శివసేన డిమాండ్ చేస్తోందట. చూడాలి మరీ బీఎంసీ మేయర్ ఎన్నిక మహారాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోంది.