చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన సంబరాల మూడ్ నుంచి బయటకు రావాలని బీజేపీ నేత కె. అన్నామలై విమర్శించారు. టీవీకే నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో మైనర్లపై రెండు ఘోరమైన నేరాలు జరిగాయి. మదురైలోని మీనాక్షి ఆలయం సమీపంలో 17 ఏండ్ల బాలుడి హత్య, కోయంబత్తూరులో 10 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
దీనికి తోడు, కోయంబత్తూరు ఘటనపై టీవీకే మంత్రి స్పందించిన తీరు, మీడియా సమావేశానికి ముందు పోలీసులు సరదాగా నవ్వుకుంటూ ఉన్న వీడియోలు వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. ఈ రెండు ఘటనలపై అన్నామలై స్పందిస్తూ "తమిళనాడులో డ్రగ్స్ విక్రేతలకు, లైంగిక దాడికి పాల్పడేవారికి, హంతకులకు స్వేచ్ఛ లభించింది. రాష్ట్ర పోలీసులు గతం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు.
టీవీకే ప్రభుత్వం ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. గత డీఎంకే పాలనలో మహిళలు, పిల్లలకు ఉన్న అభద్రతా భావమే ఇప్పుడు కూడా కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
