- డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకంతో 23 లక్షల మంది రోడ్డుపాలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కూసుమంచి, వెలుగు: నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, ఈ వ్యవహారంలో బీజేపీ పెద్దల హస్తం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో కలెక్టర్ దివాకర్ టీఎస్‌తో కలిసి మంత్రి ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నీట్ పరీక్ష జరిగిన 43 గంటల్లోనే పేపర్ లీక్ అయిందన్నారు.
దీనివల్ల తెలంగాణలో 70 వేల మంది స్టూడెంట్స్ తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. లీక్ ఘటనలో కేంద్రంలోని పెద్దల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. గత పాలనలో గ్రూప్–1, గ్రూప్–2 పరీక్ష పత్రాలు లీక్ కావడంతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పిదాలతో అప్పట్లో 29 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నీట్ లీక్ వల్ల నష్టపోయిన నిరుద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో రాంబాబు, తహసీల్దార్ సైదులు, ఎంపీడీవో జశ్వంత్ కుమార్ పాల్గొన్నారు.
