తిరుమలలో ప్రాచీన కట్టడాలను కూల్చొద్దు: లక్ష్మణ్

తిరుమలలో ప్రాచీన కట్టడాలను కూల్చొద్దు: లక్ష్మణ్
  • రాజ్యసభలో కేంద్రానికి ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, వెలుగు :  తిరుమలలో పురావస్తుశాఖ పరిధిలోని కట్టడాలు, ప్రాచీన నిర్మాణాలను పరిరక్షించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కేంద్రాన్ని కోరారు. తిరుమలలోని దాదాపు 800 ఏండ్ల నాటి ప్రాచీన పర్వెట మండపాన్ని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూల్చివేసిందని సభ దృష్టికి తెచ్చారు. అలాగే అలిపిరి దగ్గర ఉన్న పడాల మండపాన్ని కూడా కూల్చివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇలాంటి ప్రాచీనమైన, ఆధ్యాత్మికమైన నిర్మాణాలను కూల్చివేసే దశలో అనుమతులు ఇచ్చే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏడు కొండల నడుమ పవిత్రమైన, ఆధ్యాత్మికమైన తిరుమల నిండి ఉందన్నారు. చోళ, పల్లవ, విజయనగర, యాదవ రాజుల పాలన సమయంలో ఈ ప్రాచీనమైన ఆధ్యాత్మిక మండపాలు, ఆలయాలు నిర్మితమయ్యాయన్నారు. అందువల్ల తిరుమల– తిరుపతిలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రాచీన నిర్మాణాల రక్షణ ప్రాంతీయ  ప్రాముఖ్యత కన్నా, జాతీయ ప్రాముఖ్యతతో కూడుకుందన్నారు. సనాతన ధర్మాన్ని విస్తరించేలా, ఆలయ అభివృద్ధి కోసం భక్తులు కానుకల రూపంలో నిధులు ఇస్తున్నారన్నారు. కానీ ప్రాచీన నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు.. టీటీడీకి చెందిన నిధుల్ని స్థానిక తిరుపతి మున్సిపాలిటీకి మళ్లిస్తున్నారని లక్ష్మణ్  ఆరోపించారు. ఈ విషయాలను సంబంధిత శాఖలు, ప్రభుత్వ సీరియస్ గా తీసుకోవాలని సభ ద్వారా విజ్ఞప్తి చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలు సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నాయని, ఇలాంటి నిర్ణయాలతో సనాతన ధర్మాన్ని విశ్వసించే భక్తుల నమ్మకాలకు బాధను కలిగించొద్దని టీటీడీని కోరారు.