- కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?
- ప్రాజెక్టుల్లో దోచుకున్న కంపెనీకే మూసీ కాంట్రాక్టు ఎందుకిస్తున్నరు?
- బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఒకే నాణెనికి బొమ్మా బొరుసు లాంటివని కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ తుపాకీ రాముడి కబుర్లు చెబుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కావని, అవి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని విమర్శించారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య వీణా-వాణిల వంటి విడదీయరాని బంధం ఉన్నదని, ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు గొంతు చించుకుంటున్నారని, కానీ చర్యలు తీసుకునేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారని రఘునందన్ ఆరోపించారు.
కాళేశ్వరం నిర్మాణ వ్యయం, అనుమతులు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులను రేవంత్ కాపాడుతున్నారని, గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ కాపాడిన రుణం తీర్చుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న కంపెనీకే మూసీ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, ఈ రెండు పార్టీల మధ్య సదరు కంపెనీ వారధిగా పనిచేస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ కు కూతవేటు దూరంలో ఉన్న దౌల్తాబాద్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా అటు కేసీఆర్ కు గానీ, ఇటు ప్రభుత్వానికి గానీ పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నార్సింగి, చేగుంట, మాసాయిపేట మండలాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో పంటలు వడగండ్ల వానకు దెబ్బతిన్నాయని, ఇప్పటివరకు ఒక్క నేత కూడా బాధిత రైతులను పరామర్శించలేదన్నారు. కొండపల్లి సీతారామయ్య ప్రారంభించిన జగిత్యాల జైత్రయాత్ర ఏ విధంగా ముగిసిందో.. 2024తో బీఆర్ఎస్ శకం కూడా ముగిసిపోతుందని రఘునందన్ రావు జోస్యం చెప్పారు.

