- అక్రమ్ అలీకి అవార్డుపై బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: టెర్రరిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటూ.. అనేక అక్రమాలకు పాల్పడిన మహ్మద్ అక్రమ్ అలీ అనే వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు ఇవ్వడమేంటని బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న యాంటీ నేషనల్ శక్తులకు రేవంత్ రెడ్డి సర్కార్ కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. సోమవారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. అక్రమ్ అలీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం అతని పాస్‌పోర్ట్ కూడా రద్దయ్యిందని గుర్తుచేశారు.
అలీపై ఫారెన్ యాక్ట్ కేసులు ఉన్నాయని, గతంలో బాంబ్ పేలుళ్లకు సంబంధించిన మెటీరియల్ కూడా అతని వద్ద దొరికినట్లు పోలీసు రికార్డుల్లో ఉందన్నారు. ‘ఆజాద్ రిపోర్టర్’ పేరుతో డిజిటల్ ఛానల్ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన చరిత్ర అతనిదని, దీనిపై కూడా కేసులు నమోదయ్యాయని తెలిపారు. అలాంటి వ్యక్తికి మంత్రి అజారుద్దీన్ తన చేతుల మీదుగా ప్రత్యేకంగా అవార్డు ఇప్పించడం సిగ్గుచేటని మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడుంటే పహిం ఖురేషి అక్కడ ఉంటున్నారని, ఆయన ఓ షాడో సీఎంలా వ్యవహరిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు.
