
- అప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టి.. ఇప్పుడు సీమాంధ్రకు నీళ్ల తరలింపా?
- దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా కేసీఆర్, జగన్ మంతనాలు
- కమీషన్ల కోసం ఇద్దరు సీఎంల ప్రయత్నాలు
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపణ
న్యూఢిల్లీ, వెలుగు: నీళ్ల పేరిట కేసీఆర్ దోపిడీకి ప్రయత్నిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. శ్రీశైలానికి గోదావరి నీటిని తరలించేందుకు రూ. లక్ష కోట్లు ఖర్చవుతాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తున్న మాటలే ఇందుకు నిదర్శమని అన్నారు. తెలంగాణ నీటిని ఆంధ్రాకు మళ్లిస్తున్నారంటూ ఉద్యమ సమయంలో ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కేసీఆర్ పబ్బం గడుపుకున్నారని ఆయన విమర్శించారు. ఏపీలో ప్రాజెక్టులు కట్టుకొని తెలంగాణ ను ఏడారి చేశారని అప్పట్లో మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ గురువారం ఢిల్లీలో బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఉద్యమ టైమ్‌లో నదుల అనుసంధానాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని, ప్రస్తుతం కమీషన్లు, కాంట్రాక్టర్ల జేబుల నింపేందుకు ఏపీ సీఎం జగన్‌తో చర్చలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల రూపంలో పోగేసిన నల్లధనంతో రాష్ట్ర రాజకీయాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీశైలానికి గోదావరి నీటి తరలింపు పేరుతో కమీషన్లు దండుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు చూస్తున్నారని, దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు జగన్, కేసీఆర్ పదే పదే మంతనాలు జరుపుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. పోతిరెడ్డి పాడు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేసీఆర్.. ఇప్పుడు శ్రీశైలానికి కొత్తగా నీటి తరలింపు అంశం ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ లో ఏదో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే.. కేంద్రం కేటాయించే కోట్ల రూపాయలను దండుకోవాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని ఆరోపించారు.
కుట్రలను వ్యతిరేకిస్తాం
నదుల అనుసంధానానికి బీజేపీ వ్యతిరేకం కాదని లక్ష్మణ్ అన్నారు. అయితే ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రాజెక్టుల పేరిట దోచుకోవాలని పన్నుతున్న కుట్రలకు మాత్రం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. ఉద్యమం చేసిన వారిని పక్కకు నెట్టి, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టిన కేసీఆర్.. బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, బీజేపీ కేంద్ర, రాష్ట్ర సమన్వయ కర్త బాల్ రాజు పాల్గొన్నారు.
కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే
‘కృష్ణా బేసిన్ లో మన తెలంగాణకు అవసరమైన నీళ్లన్నీ ఏపీలో పోతిరెడ్డిపాడు నుంచి డైవర్ట్ చేస్తున్నరు. ఈ ఇద్దరికీ ఎందుకంత దోస్తానా? మొన్ననే గోదావరి నీళ్లను శ్రీశైలానికి పంపించి తీసుకుంటామని చెప్పారు. కేవలం మేఘా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసమే వీళ్లిద్దరూ కలుస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. ప్రజల సమస్యల మీద ఈ సీఎంకు సోయి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కమీషన్లు ఎట్ల తీసుకోవాలన్న ఆలోచనలే ఆయనకు ఎప్పుడూ. ధనిక రాష్ట్రం అన్నడు. ఐదేండ్లలో 2 లక్షల 70వేల కోట్లు అప్పులు చేసిండు. మొత్తం రాష్ట్రాన్ని అప్పులరాష్ట్రంగా మార్చారు.’’ –
‑ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి