హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌పై, పేద, మధ్య తరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారంతో విరుచుకుపడుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ తెచ్చిన ‘క్యూర్’ చట్టం ప్రజలకు తీరని ‘పెయిన్’ను మిగిలిస్తున్నదని, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పేరుతో పేదల సొమ్మును దోపిడీ చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ చట్ట సవరణ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూర్ చట్టం పూర్తిగా ప్రజలను పీల్చి పిప్పిచేసేలా ఉందని రాంచందర్ రావు విమర్శించారు. సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేకుండా, రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ఆధారంగా ఏటా 5 శాతం పన్నులు పెంచే నిబంధన పెట్టడం ముమ్మాటికీ దోపిడీయేనని చెప్పారు. నీరు, సివరేజ్ సేవలను విడదీసి వేర్వేరుగా పన్నులు వేయడం ప్రజలపై అదనపు భారం మోపడమేనని పేర్కొన్నారు.
