హైదరాబాద్, వెలుగు: పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలో దిగిన నాయకులపై బీజేపీ వేటు వేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసి పోటీలో నిలిచిన జగిత్యాల జిల్లాకు చెందిన మొత్తం 13 మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను కాదని, సొంత పార్టీ వారే రెబల్స్‌గా మారడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సీరియస్‌గా తీసుకున్నారు.
దీనిపై రాష్ట్ర క్రమశిక్షణ సంఘంతో చర్చించారు. పార్టీ సిద్ధాంతాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆయన సూచనల మేరకు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండ్ అయిన వారిలో జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన సిరికొండ భారతి, పులి శ్రీధర్, సాంబారి కళావతి, అరవ లక్ష్మి, ముద్దం రాము, రాపతి రాజు, కొక్కుల ధర్మేంద్ర., మెట్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన మర్రి నందకిశోర్, ఏ. ప్రశాంత్, బొండ నరేశ్, కోరుట్ల మున్సిపాలిటీ నుంచి ఇందూరి సత్యం, అయిలాపూర్ పద్మ, తోట రాజేశం ఉన్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని, తమ ప్రవర్తనపై వారం రోజుల్లోగా రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
