- యూఏఈ నుంచి గుజరాత్‌కు వస్తున్న థాయ్ నౌక ‘మయూరీ నారీ’
- హార్మూజ్ జలసంధి వద్ద రెండు మిసైల్స్తో ఇరాన్ అటాక్
- ఇంజిన్ రూమ్‌లో మంటలు.. ముగ్గురు గల్లంతు
- 20 మంది సిబ్బందిని రక్షించిన ఒమన్ నేవీ
- హార్మూజ్ దాటాలంటే పర్మిషన్ తప్పనిసరి: ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా
- షిప్పై దాడికి భారత్ తీవ్ర నిరసన.. ఆమోదనీయం కాదని ప్రకటన
- గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్
- అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలనూ పేల్చేస్తామని వార్నింగ్
- హార్మూజ్‌లో ఇరాన్ సీ మైన్లు.. ప్రపంచ దేశాల ఆందోళన
దుబాయ్, న్యూఢిల్లీ: భారత్‌కు వస్తున్న సరుకు రవాణా నౌకపై హార్మూజ్ జలసంధిలో మిసైల్స్తో ఇరాన్ అటాక్ చేసింది. ఈ దాడిలో ముగ్గురు షిప్ సిబ్బంది గల్లంతయ్యారు. మిగతా 20 మందిని ఒమన్ నేవీ కాపాడింది. బుధవారం ఉదయం థాయ్‌లాండ్‌కు చెందిన ‘మయూరీ నారీ’ నౌక యూఏఈ లోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తుండగా హార్మూజ్‌జలసంధి వద్ద ఈ అటాక్ జరిగింది. మిసైల్స్ నౌక వెనుక భాగంలోని ఇంజిన్ రూమ్‌కు తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. పేలుడు జరిగిన వెంటనే కెప్టెన్ ఆదేశంతో 20 మంది లైఫ్ జాకెట్లతో సముద్రంలోకి దూకారు. ఈ సమాచారం అందుకున్న ఒమన్నేవీ కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకొని 20 మందిని సురక్షితంగా ఒమన్‌లోని ఖాసబ్ పట్టణానికి చేర్చింది. దాడి సమయంలో ఇంజిన్ రూమ్‌లో ముగ్గురు సిబ్బంది ఉన్నారని.. వారి సమాచారం తెలియడం లేదని మిగతా సిబ్బంది తెలిపారు. వారి కోసం ఒమన్ నేవీ గాలిస్తున్నది. 178 మీటర్ల పొడవైన ఈ నౌక కెపాసిటీ 30 వేల టన్నులు. దాడి జరిగిన సమయంలో నౌకలో సరుకు ఏమీ లేదు.
ఈ ఘటనపై థాయ్ నేవీ వెంటనే స్పందించింది. బహ్రెయిన్‌లోని కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్, యూఏఈ, ఒమన్, బహ్రెయిన్‌లోని థాయ్ రాయబారులతో కోఆర్డినేషన్ చేస్తున్నట్టు తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13 నౌకలు దాడులకు గురయ్యాయి. హార్మూజ్ మీదుగా వెళ్లే నౌకలు తమ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా తంగ్ ష్రీ అన్నారు. నౌక తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతోనే అటాక్ చేసినట్టు చెప్పారు. బుధవారం హార్మూజ్‌లో మూడు నౌకలపై దాడులు జరగ్గా అందులో మయూరీ నారీ ఒకటి. హార్మూజ్ జలసంధిలో పరిస్థితి రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నది. భారత్‌కు వస్తున్న థాయ్ కార్గో నౌక ‘మయూరీ నారీ’పై ఇరాన్ దాడి చేయడాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘వాణిజ్య నౌకలను సైనిక దాడులకు గురిచేయడం భారత్‌కు ఆమోదయోగ్యం కాదు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పుకలిగించడం, నౌకా వాణిజ్య స్వేచ్ఛకు అడ్డంకి కలిగించడం తక్షణమే ఆపాలి” అని భారత్ స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణతో వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని తెలిపింది. అలాగే పశ్చిమాసియా ఘర్షణలో ఇప్పటికే ఇద్దరు భారత పౌరులు మృతిచెందారని.. మరొకరు ఆచూకీ తెలియకుండా పోయారని పేర్కొంది.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ పై దాడి చేస్తాం
కొద్ది రోజులుగా గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలు, డిపోలు, రిఫైనరీలపై దాడుల చేస్తున్న ఇరాన్ ఇప్పుడు యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తున్నది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన టెక్‌కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు టార్గెట్‌గా దాడులు చేస్తామని తాజాగా ప్రకటించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలపై మిసైల్స్, డ్రోన్లు ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సైనిక దాడులు మాత్రమే కాదని.. అమెరికా ఆర్థిక, టెక్నాలజీ ప్రయోజనాలను కూడా నాశనం చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఇరాన్ నిఘా సంస్థతో సంబంధం ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ ఒక లిస్ట్‌ను కూడా విడుదల చేయడం గమనార్హం. అందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, ఒరాకిల్ తదితర కంపెనీల ఆఫీసులు, డేటా సెంటర్లు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇజ్రాయెల్ నగరాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ‘‘మీరు మా బ్యాంకులపై దాడి చేశారు. ఇప్పుడు మీ సంస్థలపై మేం దాడులు చేస్తం.. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న బ్యాంకులకు సామాన్య ప్రజలు కిలోమీటర్ దూరం ఉండండి’’ అని హెచ్చరించారు. ఈ సంస్థలు పశ్చిమాసియాలో పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తున్నాయి. గూగుల్‌కు దుబాయ్‌లో రీజనల్ ఆఫీసు ఉంది. మైక్రోసాఫ్ట్ కు ఇజ్రాయెల్, అబుదాబీలో ఆఫీసులున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యూఏఈ, బహ్రెయిన్‌లలో భారీ డేటా సెంటర్లు నిర్వహిస్తున్నది.
ఇక నుంచి పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు కొత్త సమస్యలు రానున్నాయి. ఇరాన్ యుద్ధం బుధవారం నాటికి 12 రోజుకు చేరుకుంది. టెహ్రాన్, దక్షిణ లెబనాన్, బీరుట్ పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగించింది. తమ దేశంలో దాదాపు 10 వేల పౌర ఆవాసాలపై దాడులు జరిగినట్టు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటివరకు 1,300 మందికి పైగా మృతిచెందారని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో బుధవారం ఒక్క రోజే 14 మంది మరణించగా మొత్తం 500 మందికి పైగా చనిపోయారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా ఇరాన్ రెండు డ్రోన్లు ప్రయోగించింది. పేలుళ్లలో నలుగురు గాయపడ్డారు, అయినా ఫ్లైట్ సర్వీసులు కొనసాగాయి. తమపై 26 డ్రోన్లు ప్రయోగించినట్టు యూఏఈ తెలిపింది. మరోవైపు పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తరఫున ఐక్యరాజ్య సమితి(యూఎన్) భద్రతా మండలి ఒక తీర్మానంపై ఓటింగ్ నిర్వహించింది.
శత్రువులు లొంగితేనే యుద్ధం ఆగుతది: ఐఆర్జీసీ
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా పెద్ద ఎత్తున దాడులు చేపట్టినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. ఖొర్రంషాహర్ వంటి లాంగ్ డిస్టెన్స్ బాలిస్టిక్ మిసైల్స్ ను కూడా ఈ దాడుల్లో వినియోగించినట్టు తెలిపింది. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్, హైఫా, వెస్ట్ జెరూసలేం.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లు, ఆస్తులు లక్ష్యంగా ఈ ఎటాక్స్ చేసినట్టు చెప్పింది. బహ్రెయిన్‌లోని మనామా, ఇరాక్‌లోని ఎర్బిల్ లోని అమెరికా బేస్‌లపై దాడులు చేసినట్టు పేర్కొంది. ‘శత్రువు పూర్తిగా లొంగిపోయిన తర్వాత మాత్రమే యుద్ధం ఆగుతుంది”అని ప్రకటించింది.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ల దాడి
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇరాన్ బుధవారం రెండు డ్రోన్ బాంబులతో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా మొత్తం నలుగురు గాయపడ్డారు. "దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఇరాన్ రెండు డ్రోన్ బాంబులతో దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు ఘనా పౌరులు, ఒక బంగ్లాదేశీకి గాయాలయ్యాయి. అలాగే, ఒక ఇండియన్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి" అని దుబాయ్ మీడియా ఆఫీస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన అనేక డ్రోన్ బాంబులను తాము అడ్డుకున్నామని సౌదీ అరేబియాతో పాటు పలు దేశాలు పేర్కొన్నాయి.
ఐఆర్జీసీని ఉగ్రసంస్థగా ప్రకటించాలి: ఇజ్రాయెల్
ఇరాన్ కనుసన్నల్లో నడిచే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ను ‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ’గా ప్రకటించాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం భద్రతా మండలికి అధ్యక్షుడిగా ఉన్న అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ కు ఆయన బుధవారం లేఖ రాశారు. ఇరాన్ చేసిన దాడుల్లో తమ దేశానికి చెందిన 13 మంది అమాయక జనం ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ ఏడాది జనవరి 29నే ఐఆర్జీసీని ఉగ్రవాద సంస్థగా తేల్చేసిందని తెలిపారు.
