జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మున్సిపాలిటీకి సమకూరాల్సిన ఆదాయంపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆస్తి, ప్రభుత్వ కార్యాలయాల పన్నుల బకాయిలు రూ.87 కోట్లకు పైగా ఉన్న మొండి బకాయిలు రాబట్టడంపై ఆఫీసర్లు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏండ్ల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నా మొండి బకాయిల వసూళ్లకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లకు, ట్రేడ్ లైసెన్సులకు మధ్య భారీగా వ్యత్యాసం కనిపిస్తుంది. ట్రేడ్ లైసెన్సుల రూపంలో మున్సిపాలిటీ ఖజానాకు భారీగానే గండిపడుతుంది.
వసూళ్లలో లెక్కచేయని తీరు..
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నివాస, వాణిజ్య సముదాయాల నుంచి ఏటా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కావడం లేదు. దీంతో కోట్లాది రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోయి మున్సిపాలిటీ అభివృద్ధికి గుదిబండగా మారుతున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీ పరిధిలోని 12,416 నివాసాల నుంచి రూ.6.06 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.3.94 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే 65.06 శాతం పన్ను వసూళ్లు మాత్రమే నమోదయ్యాయి. మరో రూ.2.1 కోట్ల బకాయిలు వసూలు కాకుండానే మిగిలిపోయాయి.
2026-27 ఆర్థిక సంవత్సరంలో 12,471 నివాసాల నుంచి రూ.6.90 కోట్ల ఆస్తి పన్ను రాబట్టాల్సి ఉంది. గత బకాయిలను కలుపుకుంటే మొత్తం రూ.9.01 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచినప్పటికీ ఆగస్టు చివరి నాటికి రూ.96.95 లక్షలు మాత్రమే వసూలయ్యాయి.
అంటే సుమారు 16 శాతం మేర వసూళ్లు మాత్రమే జరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కూడా పూర్తిస్థాయిలో పన్నుల వసూళ్లు జరిగే పరిస్థితి కనిపించడం లేదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
సింగరేణి బకాయిలే రూ.85 కోట్లకు పైనే..
ప్రభుత్వ కార్యాలయాల పన్ను బకాయిల్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బకాయిలే రూ.85 కోట్లకు పైనే పేరుకుపోయాయి. ప్రతి ఏటా సింగరేణి నుంచి రూ.1.70 కోట్ల పన్ను మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉండగా, సంస్థ రూ.50 లక్షలకు మించి చెల్లించడం లేదు.
పన్నుల చెల్లింపుపై మున్సిపాలిటీ, సింగరేణి ఆఫీసర్లు సంయుక్తంగా సర్వే నిర్వహించి పన్నులను ఖరారు చేసినప్పటికీ, సింగరేణి ఆఫీసర్లు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తుండడంతో మున్సిపాలిటీ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ మొండి బకాయిలను రాబడితే పట్టణ అభివృద్ధి వేగవంతమవుతుంది.
కరెంటు మీటర్లకు.. ట్రేడ్ లైసెన్సులకు పొంతనేది ?
మున్సిపాలిటీ పరిధిలోని వాణిజ్య సముదాయాల విషయంలోనూ భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 3,489 కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, మున్సిపాలిటీ రికార్డుల్లో కేవలం 1,800 ట్రేడ్ లైసెన్సులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యత్యాసం కారణంగా మున్సిపాలిటీ ఖజానాకు భారీగా ఆదాయం గండిపడుతోందని పట్టణ ప్రజలు అంటున్నారు.
నివాస సముదాయాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం 12,471 నివాసాలు ఉండగా, విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం నివాస కనెక్షన్లు 19,224 ఉన్నాయి. ఈ భారీ వ్యత్యాసంపై క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో 1,933 ట్రేడ్ లైసెన్సుల ద్వారా రూ.68 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.27 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,800 ట్రేడ్ లైసెన్సులకు గాను ఇప్పటివరకు సుమారు 600 లైసెన్సులు మాత్రమే పునరుద్ధరించుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా మొండి బకాయిల వసూళ్లు, విద్యుత్ కనెక్షన్ల ఆధారంగా ఆస్తులు, వాణిజ్య సంస్థల గుర్తింపు, ట్రేడ్ లైసెన్సుల క్రమబద్ధీకరణపై ఆఫీసర్లు దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
