గండిపేట, వెలుగు: పుట్టిన ఒకట్రెండు రోజులకే ఓ నవజాత ఆడశిశువును ప్లాస్టిక్ సంచిలో పెట్టి రోడ్డు పక్కన వదిలేసిన ఘటన శంషాబాద్‌లో కలకలం రేపింది. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీ బ్రిడ్జి సమీపంలోని ఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఓ తెల్లటి సంచిలో పసిపాప ఉందంటూ డయల్–100కు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు సంచిలో ఉన్న ఒకట్రెండు రోజుల వయస్సున్న ఆడశిశువును సురక్షితంగా బయటకు తీశారు. పాపను తొలుత శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అమీర్‌పేట్‌లోని శిశు విహార్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
