అలికాంటే (స్పెయిన్): ఇండియా స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్.. బాక్సామ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నీలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన విమెన్స్ 75 కేజీల తొలి రౌండ్‌లో లవ్లీనా 5–0తో ఓల్హా పైలిప్‌చుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. బలమైన పంచ్‌లు, హుక్స్, కట్స్‌తో బౌట్ ఆద్యంతం లవ్లీనా ఆధిపత్యం చూపెట్టింది. మంజు రాణి (48 కేజీ) 5–0తో గ్లోరియా డి అల్మెయిడా (ఫ్రాన్స్)పై, నీతూ (51 కేజీ) ఆర్‌ఎస్‌సీ ద్వారా లారా కాల్డెరాన్ (స్పెయిన్)పై, కుసుమ్ (51 కేజీ) 4–1తో క్లాడియా అల్కానిజ్ (స్పెయిన్)పై, అరుంధతి చౌదరీ (70 కేజీ) 5–0తో అజీజా ఇస్సినా (కజకిస్తాన్)పై, సనామాచా చానూ (75 కేజీ) 4–1తో విక్టోరియా పెన్నీ (కెనడా)పై గెలిచారు. మెన్స్ 70 కేజీల్లో హితేష్ 5–0తో విన్సెంట్ శాంటోరియెల్లో (కెనడా)పై నెగ్గాడు. పవన్ (55 కేజీ), జాదుమణి సింగ్ (55 కేజీ), దీపక్ (70 కేజీ), అంకుష్ (80 కేజీ), హర్ష్ చౌదరీ (90 కేజీ) తమ బౌట్లలో ప్రత్యర్థులపై విజయాలు సాధించి ముందంజ వేశారు.
