కజకిస్థాన్: నాలుగు సార్లు ఏషియన్ చాంపియన్ షిప్ విజేత శివ థాఫా.. ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించాడు. 63 కిలోల విభాగంలో శివ బంగారు పతకం సాధించగా, మహిళల 60 కిలోల విభాగంలో పర్వీన్ సిల్వర్ మెడల్ గెలిచింది. గాయం కారణంగా తన ప్రత్యర్థి జాకిర్ సఫీయుల్లిన్ బౌట్‌కు రాకపోవడంతో ఫైనల్లో శివను విజేతగా ప్రకటించారు. కాగా, సెమీస్‌లో 3–2తో వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత కరినా ఇబ్రాగిమోవాను ఓడించి ఫైనల్ చేరిన పర్వీన్ టైటిల్ బౌట్‌లో 0–5తో రిమ్మ వోలోసెన్కో( కజకిస్థాన్) చేతిలో ఓడిపోయి సిల్వర్‌తో సరిపెట్టుకుంది. 81 కిలోల సెమీస్‌లో స్వీటీ బూర కూడా 1–4తో ఎలినా(రష్యా) చేతిలో, పురుషుల 69 కిలోల సెమీస్‌లో దుర్యోధన్ సింగ్ 1–4తో షాయ్‌కెన్ తాల్గట్ చేతిలో ఓడిపోయి కాంస్యాలకు పరిమితమయ్యారు.

