
- నెలాఖరులో ప్రారంభించనున్న సీఎం
- ముందుగా 60 చోట్ల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం
- పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ స్కీంలో భాగంగా ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్పెట్టాలని బల్దియా భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు బల్దియా మెనూ సిద్ధం చేసింది. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు ఇందులో ఉన్నాయి.
కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్
ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు కొత్తగా మారుస్తున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఈ స్టాల్స్ ఉండగా, వీటి సంఖ్యని 150 పెంచారు. 2013లో ముందుగా ఈ పథకాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సంఖ్యని పెంచుతూ వచ్చారు. ఇలా ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన స్టాల్స్ కావడంతో చాలా వరకు డ్యామేజ్అయ్యాయి. కొన్నిచోట్ల అయితే పూర్తిగా ఖరాబై వినియోగించేందుకు వీలు లేకుండా పోయాయి. దీంతో వీటి స్థానంలో రూ.11.43 కోట్లతో బల్దియా కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 చోట్ల స్టాల్స్ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న సైజుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ స్పేస్తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
రూ.14ని భరించనున్న బల్దియా
ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న బల్దియా రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకుంది. ఒక్క బ్రేక్ ఫాస్ట్ కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి తీసుకుంటుండగా, రూ.14 బల్దియా భరించనున్నది. బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రోజూ 25వేల మందికి బ్రేక్ ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బీఆర్ ఎస్ హయాంలో పట్టించుకోలే....
బీఆర్ఎస్హయాంలో రూ.5 భోజన కేంద్రాలను అస్సలు పట్టించుకోలేదు. పూర్తిగా డ్యామేజ్ అయిన చోట కూడా కొత్తగా స్టాల్స్ ఏర్పాటు చేయలేకపోయారు. అప్పట్లో వర్షాలు పడే టైంలో కొన్ని సెంటర్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పాటుకు ముందే ఈ కేంద్రాలు ఏర్పాటు కాగా, ఇప్పటికీ ఈ స్కీమ్ ని తామే అందుబాటులోకి తీసుకొచ్చామని బీఆర్ఎస్లీడర్లు చెప్తుంటారు.