ఆమెకు క్యాన్సర్ గండం! రాష్ట్రంలో ఐదున్నరేండ్లలో లక్ష కేసులు.. అందులో 60% బాధితులు మహిళలే

ఆమెకు క్యాన్సర్ గండం! రాష్ట్రంలో ఐదున్నరేండ్లలో లక్ష కేసులు.. అందులో 60%  బాధితులు మహిళలే
  • రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల విజృంభణ.. 33 ఏండ్ల నుంచే మహమ్మారి పంజా
  • 39–48 ఏజ్ గ్రూపులో రిస్క్ అత్యధికం
  • హనుమకొండ జిల్లాలో హయ్యెస్ట్ ఇన్సిడెన్స్ రేటు  
  • హైదరాబాద్​లోనే ఎక్కువ మందికి క్యాన్సర్ 
  • ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా క్యాన్సర్ వైద్యంపై రిపోర్ట్‌‌ రిలీజ్‌‌ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్నది. ముఖ్యంగా ఇంటికి వెలుగునిచ్చే మహిళ ఆరోగ్యానికి ఈ వ్యాధి పెద్ద గండంగా మారింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్​కేర్ ట్రస్ట్  ద్వారా ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌‌లో సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఒక రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. 

ఈ ఐదున్నరేండ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 294 మంది క్యాన్సర్ బారిన పడగా, అందులో ఏకంగా 60 శాతం మంది మహిళలే ఉండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్నది. అంటే సుమారు 60 వేల మంది ఆడబిడ్డలు ఈ ప్రాణాంతక వ్యాధితో  పోరాడుతున్నారు. గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులకే పరిమితమని అనుకునేవారు. కానీ ఈ రిపోర్టు ప్రకారం 33 ఏండ్ల వయస్సు నుంచే మహిళలపై ఎక్కువగా క్యాన్సర్ పంజా విసురుతున్నట్లు స్పష్టమవుతున్నది. 


పురుషులతో పోలిస్తే మహిళల్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ రేటు చాలా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాలో సగటున 62 మంది మహిళలు మహమ్మారి బారిన పడుతుండగా, పురుషుల్లో ఆ సంఖ్య 42కు పరిమితమైంది. మహిళల ప్రాణాలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్లు యమపాశాల్లా మారాయి. ఆరోగ్య శ్రీలో చికిత్స పొందిన వారి లెక్కల ప్రకారం.. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 15,502 కాగా, గర్భాశయ క్యాన్సర్ కేసులు 11,834గా నమోదయ్యాయి. అండాశయ క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ కేసులు 5,700గా రికార్డయ్యాయి. ఈ మూడు రకాల క్యాన్సర్లే మహిళా బాధితుల్లో సింహభాగం ఉంటున్నాయి. వీరికి పాలియేటివ్ కేర్, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల అవసరం ఎక్కువగా ఉంటోంది. ఏడాదికి సగటున 18,235 కేసులు నమోదవుతుండగా, అందులో సుమారు 11 వేల కేసులు మహిళలవే ఉంటున్నాయి.

  • నడివయస్సులోనే అటాక్

క్యాన్సర్ కేసులు 19  నుంచి 32 ఏండ్ల వరకు ఆడ, మగ మధ్యన సమానంగానే ఉంటున్నాయి. 33 ఏండ్లు దాటగానే ముప్పు పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలో 33 ఏండ్ల వయస్సు నుంచే కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 33 – 38 ఏండ్ల మధ్య  ఆడవాళ్లలో 4,500 కేసులు నమోదు కాగా, మగవాళ్లలో 3,082 కేసులు మాత్రమే నమోదయ్యాయి. 39 నుంచి 48 ఏండ్ల మధ్య వయస్సులో పీక్ స్టేజ్‌‌‌‌కు చేరుకుంటున్నాయి. ఈ మధ్య వయస్కుల్లోనే ఆడ, మగవాళ్లలో భారీ వ్యత్యాసం కనిపించింది. 

ఐదురున్నరేండ్ల కాలంలో.. 23,516 కేసులు నమోదవ్వగా..  అందులో 15,198 మంది మహిళలే ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. మహిళలు నడి వయసులోనే వ్యాధి బారిన పడుతుండటంతో వేలాది కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా కుప్పకూలిపోతున్నాయి. చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్లు ఎక్కువగా ఉండగా, వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల తీవ్రత పెరుగుతోంది. 

  • హనుమకొండ జిల్లాలో ప్రతి లక్షకు 79 మందికి..

జిల్లాలవారీగా చూస్తే.. హైదరాబాద్ జిల్లా 12,517 కేసులతో ఆడ, మగ బాధితుల సంఖ్యలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రంగారెడ్డి 6,372, మేడ్చల్ 5,483  కేసులతో  టాప్-3లో ఉన్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో 804  కేసులు నమోదయ్యాయి. అయితే జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే హనుమకొండ జిల్లా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక్కడ ప్రతి లక్ష మందికి 79 మందికి క్యాన్సర్ సోకుతోంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా ఎక్కువ. హైదరాబాద్ జిల్లాలో ప్రతి లక్ష మందిలో 72 మంది క్యాన్సర్‌‌‌‌ ‌‌‌‌బారినపడుతున్నారు. చికిత్స కోసం సుమారు 53.4 శాతం మంది  క్యాన్సర్ పేషంట్లు ప్రైవేట్ హాస్పిటల్స్‌‌‌‌ను ఆశ్రయిస్తుండగా, పేదలకు మాత్రం హైదరాబాద్క్‌‌‌‌లోని ఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద దిక్కుగా మారింది.

  • స్క్రీనింగ్ తప్పనిసరి 

పెళ్లిళ్లు, పిల్లలు కలగడంలాంటి రీప్రొడక్టివ్ కారణాలతోపాటు మారుతున్న లైఫ్ స్టైల్, ఊబకాయం, పొల్యూషన్, వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల మహిళలు క్యాన్సర్ కోరల్లో చిక్కుకుంటున్నారని రిపోర్టు హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే 40 ఏండ్లు దాటిన మహిళలు ఏటా మామోగ్రామ్, ప్యాప్ స్మియర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. చిన్న వయసులోనే ఆడపిల్లలకు హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్ వేయించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మంచి పౌష్టికాహారం తీసుకుంటూ.. రోజూ ఎక్సర్‌‌‌‌సైజ్ చేస్తూ.. పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో 33 ఏండ్ల నుంచే కేసులు బయటపడుతున్నందున ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లైట్ తీసుకోకుండా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే ఈ మహమ్మారిని తొలి దశలోనే తుంచేయవచ్చని రిపోర్టు స్పష్టం చేస్తోంది.