కార్మికులకు భరోసా ఉంటేనే ఉత్పాదకత..: మంత్రి వివేక్ వెంకటస్వామి

కార్మికులకు భరోసా ఉంటేనే ఉత్పాదకత..: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సోషల్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్, కార్మిక హక్కులపై కలిసి పనిచేయాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • హైదరాబాద్‌‌‌‌లో ఘనంగా ప్రారంభమైన ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్‌‌‌‌‌‌‌‌ 2026
  • 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు 

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్​ ఇంటిలెజెన్స్, ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారుతున్న ప్రస్తుత తరుణంలో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అత్యంత అవసరమని  కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కార్మికులు తమ ఉద్యోగాలు, కుటుంబ భవిష్యత్తుపై భరోసాతో ఉన్నప్పుడే ఉత్పాదకత పెరుగుతుందని, ఇందుకోసం సోషల్ సెక్యూరిటీ, స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్, కార్మిక హక్కుల పరిరక్షణపై ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలన్నారు.

హైదరాబాద్‌‌‌‌లోని మారియట్ హోటల్‌‌‌‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమిట్–2026’ ను మంగళవారం ఆయన కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్ మాండవీయతో కలిసి ప్రారంభించారు. ఈ నెల  14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని అతిపెద్ద కేంద్ర కార్మిక సంఘం ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ ఆతిథ్యం ఇస్తోంది.

ఉత్తమ విధానాల రూపకల్పనే లక్ష్యం

ఈ సమిట్‌‌‌‌లో టెక్నాలజీ మార్పులు, భవిష్యత్ ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రత, కార్మిక హక్కులు, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను పరస్పరం అధ్యయనం చేసి, వాటిలో అత్యుత్తమమైన విధానాలను అన్ని దేశాలూ అనుసరించేలా సిఫార్సులు రూపొందించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

తెలంగాణ యువతకు గ్లోబల్ అవకాశాలు

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివేక్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్వాన్స్‌‌‌‌డ్ టెక్నాలజీ సెంటర్లు  ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక కోర్సుల ద్వారా యువతను పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలోని పలు దేశాల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారీ డిమాండ్ ఉందని, ఆ అవకాశాలను మన యువతకు అందించేందుకు ప్రభుత్వ సంస్థ ‘టామ్‌‌‌‌కామ్’ జర్మనీ, జపాన్, యూరప్, పశ్చిమాసియా దేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు వివరించారు. దీంతో యువతకు అధిక వేతనాలతో కూడిన విదేశీ ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రంలోనూ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.

ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో భారత్‌‌‌‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, బెలారస్, మలేషియా, నైజీరియా సహా మొత్తం 14 దేశాలకు చెందిన సుమారు 110 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. కార్మిక సంక్షేమం, సామాజిక న్యాయం, ఉపాధి భద్రత, అంతర్జాతీయ సహకారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన సిఫార్సులను రూపొందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌‌‌‌లు పనిచేస్తున్నాయి.