- గైడ్లైన్స్, అర్హతలు, అప్లికేషన్లు, టెండర్ల ప్రక్రియ విడుదల చేస్తం: మంత్రి పొంగులేటి
- పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి 500 ఇండ్లు నిర్మిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ( క్యూర్ ) పరిధిలో ఈ నెల 20న అల్పాదాయ వర్గాల(ఎల్ఐజీ) ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే స్కీమ్ విధివిధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు. దశల వారీగా లక్ష ఎల్ ఐ జీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. మంగళవారం సెక్రటేరియెట్ లో హౌసింగ్ శాఖ సెక్రటరీ వీపీ గౌతమ్, సీఈ రమణారెడ్డి, ఇతర అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున, స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట్ల వెయ్యి వరకు ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా సిటీకి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించడంవల్ల అంతదూరం పోలేకపోయారని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవనోపాధి, పిల్లల చదువు దెబ్బతినకుండా ప్రస్తుత నివాసాలకు సమీపంలోనే నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని ఇండ్లను నిర్మిస్తుందన్నారు.
అత్యంత విలువైన ఆ స్థలాల్లో లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు సైతం కల్పిస్తున్నామని చెప్పారు. క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించామని మంత్రి చెప్పారు.
