- నానక్‌రామ్‌గూడలోని రవీందర్ నివాసం సహా 10 చోట్ల ఏసీబీ సోదాలు
- 12.5 కిలోల వెండి, రూ.3.82 లక్షల నగదు సీజ్
- 4 కార్లు సహా మొత్తం 9.24 కోట్ల విలువైన ఆస్తులు గుర్తింపు
- మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.100 కోట్లు ఉంటాయని అంచనా
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఫిర్యాదులతో కేసులు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన మరో అవినీతి తిమింగళం బయటపడింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ( హెచ్‌ఎండీఏ) ఛీన్ ఇంజినీర్ బచ్చు రవీందర్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. మంగళవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు ప్రారంభించారు.
నానక్‌రామ్‌గూడలోని రవీందర్ నివాసంతో పాటు శంషాబాద్, మసీద్ బండ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రూ. 3.82 లక్షలు నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 12.5 కిలోల వెండి సహా మొత్తం రూ.9.24 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. రవీందర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు, బుధవారం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
ఫ్లై ఓవర్ల నిర్మాణంలో రవీందర్ అవినీతి!
నిజామాబాద్ కు చెందిన రవీందర్ 1985 మే 20 వ తేదీన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరాడు. తర్వాత హెచ్‌ఎండీఏలో పనిచేశాడు. ఓఆర్ఆర్ తో పాటు సిటీలోని ఫ్లై ఓవర్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే కాంట్రాక్ట్ కంపెనీలకు బిల్స్ ప్రాసెస్‌కు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయడంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రవీందర్‌పై గత రెండు నెలలుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు.. ఆయన ఆస్తుల వివరాలను సేకరించారు. పక్కా ఆధారాలతో సోదాలు నిర్వహించారు.
సోదాల్లో గుర్తించిన ఆస్తులు
గృహోపకరణాలు: రూ.17.24 లక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు: రూ.9.32 లక్షలు
కొండకల్, కిష్టాపూర్, పసమాలలో ఐదు ఓపెన్ ప్లాట్లు: రూ. 38.89 లక్షలు
నార్సింగి, నానక్ రామ్‌గూడలో నాలుగు రెసిడెన్సియల్ ఫ్లాట్లు: 2.07 కోట్లు
శంకర్‌పల్లి మండలం మోకిల శ్రీవారి మిడోస్‌లో విల్లా: రూ.1.34 కోట్లు
కొండాపూర్ మజీద్ బండలో జీ+4 బిల్డింగ్: రూ.3 కోట్లు
రూ.3.82 లక్షల నగదు, రూ.45.05 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్
1.44 కిలోల బంగారం,12.5 కిలోల వెండి ఆభరణాలు, నాలుగు కార్లు
కొత్తూరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి
