హైదరాబాద్, వెలుగు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌లో ప్రైవేట్ సంస్థలకు చోటు కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు మంగళవారం స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన సమావేశంలో వర్సిటీ అధికారులు సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గతంలో యూనివర్సిటీలో ప్రైవేట్ సంస్థలకు స్థలం కేటాయించనున్నారనే ప్రచారం జరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత 15 రోజులుగా ఆందోళనలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు యూనివర్సిటీల్లో ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు స్థలం కేటాయించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నిత్యానందరావు నాంపల్లి ప్రాంగణంలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి విద్యార్థులకు వివరాలు వెల్లడించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ.. వర్సిటీలో సంబరాలు నిర్వహించారు.
