టెండర్ ధాన్యం పైసలు ఇయ్యట్లే!..2022–23 యాసంగి వడ్లు 16,31,439 టన్నులు పెండింగ్

టెండర్ ధాన్యం పైసలు ఇయ్యట్లే!..2022–23 యాసంగి వడ్లు 16,31,439 టన్నులు పెండింగ్
  • 1,572 మంది మిల్లర్ల నుంచి రూ.3,847.38 కోట్లు రాలేదు
  • ఇటీవల వసూలైంది రూ.40.20 కోట్లు మాత్రమే
  • రూ.558.93 కోట్ల వేలం ధాన్యం బాకీలతో సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానం

హైదరాబాద్, వెలుగు: 2022–23 యాసంగి సీజన్‌‌‌‌లో ఈ-–టెండర్‌‌‌‌ ద్వారా విక్రయించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించి, రైస్‌‌‌‌ మిల్లర్ల నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ వసూల్ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,572 మంది రైస్‌‌‌‌ మిల్లర్ల నుంచి రూ.3,887.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇటీవల రూ.40.20 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. దీంతో ఇంకా రూ.3,847.38 కోట్ల బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. అంటే మొత్తం బకాయిల్లో కేవలం 1.03 శాతం మాత్రమే రికవరీ కాగా, 98.97 శాతం బకాయిలు ఇంకా వసూల్ కావాల్సి ఉంది.

వేలం ధాన్యం బకాయిలు రూ.3,847.38 కోట్లు..

2022–23 యాసంగిలో రైతుల నుంచి సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖ 66.84 లక్షల టన్నుల వడ్లను సేకరించింది. అయితే, మిల్లింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పటి బీఆర్ఎస్ సర్కారు దాదాపు సగం ధాన్యాన్ని టెండర్ల ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేసి, 2024 జనవరి 25న 38 లక్షల టన్నుల వడ్లకు కొత్త టెండర్లు పిలిచింది. బిడ్లు దాఖలు చేసిన 26 కంపెనీలకు ఈ ధాన్యాన్ని కేటాయించారు.

ఈ కంపెనీలు మిల్లర్ల వద్ద ఉన్న ధాన్యాన్ని సేకరించి, సివిల్ సప్లయ్స్ శాఖకు దాదాపు రూ.7 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, టెండర్‌‌‌‌ ద్వారా విక్రయించిన తర్వాత మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేకపోవడం, కొందరు మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఫిజికల్​ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో ధాన్యం కొరత బయటపడింది. టెండర్‌‌‌‌లో ధాన్యం దక్కించుకున్న కంపెనీలు మిల్లర్ల నుంచి 16,31,439.557 టన్నుల ధాన్యాన్ని నిర్ణీత గడువులోగా వసూల్ చేయలేక చేతులెత్తేసాయి. దీంతో ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి ధరను నిర్ణయించి, ఆ మేరకు బకాయిలను సివిల్ సప్లయ్స్​ శాఖకు చెల్లించాలని మిల్లర్లను ఆదేశించింది. 

జిల్లాల వారీగా భారీ బకాయిలు..

ఈ పెండింగ్ ధాన్యానికి సంబంధించి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో రూ.558.93 కోట్ల బకాయిలు ఉండగా, అక్కడ ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదు. వనపర్తి రూ.474.43 కోట్లు, నిర్మల్ రూ.294.98 కోట్లు, నిజామాబాద్ రూ.261.00 కోట్లు, నాగర్ కర్నూల్ రూ.250.24 కోట్లు, మెదక్ రూ.245.47 కోట్లు, నల్గొండ రూ.241.84 కోట్లు, జగిత్యాల రూ.206.31 కోట్లు, మహబూబ్‌‌‌‌నగర్ రూ.152.96 కోట్లు,  నారాయణపేట రూ.151.88 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. పలు జిల్లాల్లో వందకు పైగా మిల్లులు బకాయిలను పెండింగ్​ పెట్టాయి. ముఖ్యంగా నిజామాబాద్​లో 125 మిల్లులు, వనపర్తిలో 114 మిల్లులు, సిద్దిపేటలో 103 మిల్లులు, కరీంనగర్​లో 101 మిల్లులు ధాన్యం లేదా దానికి సంబంధించిన పైసలు ఇవ్వకుండా మొండికేస్తున్నాయి.

కొన్ని జిల్లాల్లోనే పరిమిత రికవరీ..

టెండర్​ ధాన్యానికి సంబంధించిన రికవరీ కొన్ని జిల్లాల్లో మాత్రమే కొంత మెరుగ్గా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 23.33 శాతం, హనుమకొండలో 14.21 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 11.56 శాతం, మహబూబాబాద్‌‌‌‌లో 7.38 శాతం రికవరీ నమోదైంది. అయితే, మెజారిటీ జిల్లాల్లో రికవరీ శాతం కనీసం ఒక శాతానికి కూడా చేరకపోవడం గమనార్హం.

దిద్దుబాటు చర్యల్లో సివిల్ సప్లయ్స్..​

2022–23 యాసంగి టెండర్‌‌‌‌ ధాన్యం బకాయిల వసూళ్లపై ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు చేపట్టింది. డిఫాల్ట్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవసరమైతే సెక్యూరిటీ డిపాజిట్ల స్వాధీనం, ఆస్తుల జప్తు వంటి చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు, దాదాపు రెండు వేల రైస్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ బకాయిలు రూ.4 వేల కోట్లకు పైగా చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గత ఆరు నెలల్లోనే సుమారు రూ.1,000 కోట్ల మేర బకాయిలను వసూల్ చేసినట్లు సమాచారం. పాత బకాయిలు పూర్తిగా చెల్లించిన మిల్లర్లకే భవిష్యత్తులో సీఎంఆర్ కేటాయింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్రానికి ఆర్థిక భారం..

వేల కోట్ల రూపాయల బకాయిలు వసూల్ కాకపోవడంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ఇది రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడంపై, అలాగే వచ్చే సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధుల సమీకరణపై, బ్యాంకు వడ్డీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు 'ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్రొక్యూర్‌‌‌‌మెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌' అమల్లో ఉన్నప్పటికీ, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి బకాయిల వసూళ్లలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.