- 9వ తరగతి నుంచే కొత్త రూల్స్
- రెండు భారతీయ భాషలు చదవడం తప్పనిసరి
- క్లాసుల వారీగా గైడ్ లైన్స్ ఇచ్చిన సీబీఎస్ఈ
హైదరాబాద్, వెలుగు: సీబీఎస్‌ఈ విద్యార్థులకు ఇకపై మూడు లాంగ్వేజెస్తప్పనిసరి కానున్నాయి. జాతీయ విద్యా విధానం– 2020లో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుంచి త్రిభాషా ఫార్ములా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తాజాగా పూర్తిస్థాయి గైడ్‌లైన్స్‌ను సీబీఎస్ఈ రిలీజ్ చేసింది. కొత్త రూల్ ప్రకారం.. విద్యార్థులు ఎంచుకునే మూడు భాషల్లో కనీసం రెండు కచ్చితంగా భారతీయ భాషలే ఉండాలి.
ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్చదువుతుంటే హిందీ లేదా సంస్కృతం వంటి స్వదేశీ భాషలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలుగు, హిందీ చదువుతుంటే మూడో భాషగా ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ వంటి విదేశీ భాషలను ఎంచుకోవచ్చు. మన భాషలను గౌరవించడంతో పాటు విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది.
దశల వారీగా అమలు..
త్రిభాషా ఫార్ములాను విద్యార్థులకు ఇబ్బంది కాకుండా దశలవారీగా అమలు చేయనున్నారు. 2026–-27 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుతున్న బ్యాచ్‌కు మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వారంతా పాత పద్ధతిలోనే రెండు భాషలు చదువుతారు. కానీ ఈ ఏడాది 9వ తరగతిలోకి వచ్చే విద్యార్థులు కచ్చితంగా మూడు భాషలు చదవాలి. ఒకవేళ ప్రస్తుతం ఒకే ఇండియన్ లాంగ్వేజ్ చదువుతుంటే.. అదనంగా మరో భారతీయ భాషను చేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 2026-–27లో ఆరో తరగతిలో చేరే విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో కచ్చితంగా మూడు భాషలను అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
మూడో భాషలో పాసైతేనే టెన్త్ సర్టిఫికెట్..
పరీక్షల విషయంలో బోర్డు కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది. 2026–-27 నాటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మూడో భాషపై కేవలం స్కూల్ స్థాయిలోనే ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి, బోర్డు ఎగ్జామ్ ఉండదు. కానీ, పదో తరగతి సర్టిఫికేట్ రావాలంటే మాత్రం ఈ మూడో భాషలో తప్పనిసరిగా పాస్ కావాల్సి ఉంటుంది. ఇక 2026-–27లో 6వ తరగతిలోకి వచ్చే బ్యాచ్ మాత్రం.. పదో తరగతికి వచ్చేసరికి మూడు భాషలకు బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. దివ్యాంగ విద్యార్థులకు, విదేశాల్లోని సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివేవారికి, ఉద్యోగ రీత్యా తరచూ రాష్ట్రాలు మారే విద్యార్థులకు నిబంధనల ప్రకారం కొన్ని మినహాయింపులు ఇచ్చారు.
టీచర్ల కొరత ఉంటే ఆన్‌లైన్ క్లాసులు..
స్కూళ్లలో కొత్త భాషలు నేర్పించడానికి టీచర్లు లేకపోతే.. రిటైర్డ్ టీచర్లను నియమించుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. అదీ సాధ్యంకాకపోతే ఆన్‌లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులకు నేర్పించాలని ఆదేశించింది. ఎన్సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌లో ఈ భాషలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. దీనిపై ఏవైనా సందేహాలు ఉంటే cq26-27@cbseshiksha.in మెయిల్ ఐడీని సంప్రదించవచ్చని తెలిపింది. అయితే, దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త భాషలు నేర్చుకోవడం మంచిదే అయినా, పరీక్షల భారం పెరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణపై ఎఫెక్ట్ తక్కువే..
సర్కారు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇప్పటికే తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగుతోంది. 2024 నుంచి అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలోనూ ఇది అమలవుతోంది. ఫస్ట్ లాంగ్వేజీ మాత్రం హిందీ, ఇంగ్లీష్ ఉంది. ప్రస్తుతం త్రిభాష విధానంలో తెలుగును సెకండ్, థర్డ్ లాంగ్వేజ్‌గా కొనసాగనున్నట్లు విద్యావేత్తలు చెప్తున్నారు.
