V6 News

బస్తాకు రూ. 300 ఇస్తేనే మార్క్.. కేసముద్రం మార్కెట్‌లో దళారుల దందా.!

బస్తాకు రూ. 300 ఇస్తేనే మార్క్.. కేసముద్రం మార్కెట్‌లో దళారుల దందా.!

మహబూబాబాద్ జిల్లాలోని  కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే.. ఇక్కడ దళారుల దందా, సిబ్బంది అవినీతి రైతుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వానికి ఒక్కో బస్తాకు 29 రూపాయలు చెల్లిస్తున్న రైతు నుంచి  అదనపు వసూళ్ల సెగ తగులుతోంది.

లారీ పైకి బస్తా ఎక్కించాలంటే 200 నుంచి 300 రూపాయలు ఇవ్వాల్సిందే! డబ్బులిస్తేనే బస్తాపై కలర్ మార్క్ పడుతుంది. లేదంటే వెయిటింగ్ తప్పదు.  .సీరియల్ తో పనిలేదు, క్యూలో నిలబడక్కర్లేదు.. డబ్బులిస్తే చాలు పది నిమిషాల్లో లోడింగ్ పూర్తవుతుందంటూ హమాలీలు, సిబ్బంది బహిరంగంగానే ఆఫర్లు ఇస్తున్నారు.

నాలుగు రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ కలెక్టర్ వెళ్లిన కాసేపటికే మళ్ళీ పాత కథే మొదలైంది.పది రోజులుగా మార్కెట్‌లోనే నిద్రపోతున్నాం.. మా మొక్కజొన్న కుప్పలను పందులు, కోతులు తింటున్నాయి. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు" అని గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు.

మార్కెట్ పాలకవర్గం, సెక్రటరీ కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి కేసముద్రం మార్కెట్‌లో జరుగుతున్న ఈ అక్రమాల మాట్లాడాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు.