మంట కలుస్తున్న మానవ సంబంధాలు.. అన్నా చెల్లెళ్ల సంబంధం ఇదేనా.. నల్గొండ జిల్లాలో  ఘటన

మంట కలుస్తున్న మానవ సంబంధాలు.. అన్నా చెల్లెళ్ల సంబంధం ఇదేనా.. నల్గొండ జిల్లాలో  ఘటన
  • చెల్లిపై అన్న లైంగిక దాడి..

శాలిగౌరారం(నకిరేకల్), వెలుగు: ఓ బాలికపై ఆమె అన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు.  నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.

గత నెల 20న సొంత బాబాయి కొడుకు(మైనర్) ఆమెను ఇంట్లోకి పిలిచి కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈ ఘటనపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా.. ఇకనుంచి ఎవరి జోలికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు.

తర్వాత బాలికను ఖమ్మంలోని బంధువుల ఇంటికి పంపారు. కాగా, సోమవారం ఆమె తిరిగి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆ బాలుడు రాత్రి కత్తులు పట్టుకొని ఇంటికి వెళ్లి బయటకు రావాలని లేకపోతే ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరించాడు. బాధితురాలి తండ్రి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్​కానిస్టేబుల్​ పేర్కొన్నారు.