ఆ రెండు పార్టీలను త్వరలో బొంద పెడతరు..టీఆర్ఎస్ చీఫ్ కవిత ఫైర్

ఆ రెండు పార్టీలను త్వరలో బొంద పెడతరు..టీఆర్ఎస్ చీఫ్ కవిత ఫైర్
  • కృష్ణా జలాల మళ్లింపుతోనే పాలమూరు, రంగారెడ్డి పచ్చగా మారుతాయి
  • రాష్ట్రానికి జరుగుతున్న ద్రోహాన్ని అడ్డుకుంటామని కామెంట్

షాద్ నగర్, వెలుగు: తెలంగాణకు నీటి విషయంలో జరుగుతున్న జలద్రోహాన్ని అరికట్టేందుకే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ఆవిర్భవించిందని ఆ పార్టీ చీఫ్  కల్వకుంట్ల కవిత అన్నారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్  చేసిన ద్రోహాన్ని ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. బీఆర్ఎస్  పదేండ్లు, కాంగ్రెస్  వచ్చి రెండున్నరేండ్లు గడిచినా కృష్ణా నీళ్లు మనకు రాలేదన్నారు. కృష్ణా జలాల మళ్లింపుతోనే పాలమూరు– -రంగారెడ్డి జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు.

 పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సమస్యను ఆమె లేవనెత్తారు. మాజీ సీఎం కేసీఆర్  ఈ ప్రాజెక్టు విషయంలో విఫలమయ్యారని, ప్రస్తుత కాంగ్రెస్  ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. తెలంగాణకు జలద్రోహం చేస్తున్న కాంగ్రెస్​ను ప్రజలు బొంద పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే వాటర్  కమిషన్  ఏర్పాటు చేసి, సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లిస్తామని హామీ ఇచ్చారు.  

33 వేల కోట్లు ఖర్చు చేసి 33 ఎకరాలకు నీళ్లివ్వలే..

పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో మనకు తీరని అన్యాయం జరిగిందని, పాలమూరు– -రంగారెడ్డి కోసం రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశారు కానీ, కనీసం 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్  అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా పరిస్థితిలో మార్పు రాలేదని, గత పాలకుల బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం నడుస్తోందని ధ్వజమెత్తారు. కృష్ణా నది జిల్లాలో 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా ఇక్కడి రైతులకు నీరు అందడం లేదని, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సమస్యను గతంలో కేసీఆర్ విస్మరించారని, ఆ అన్యాయాన్ని సరిదిద్దడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు.

దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను కాంగ్రెస్  ప్రభుత్వం ప్రారంభించాలని, లేదంటే ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తానని ఆమె హెచ్చరించారు. ఇక పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ప్రకటించాలని ఆమె డిమాండ్  చేశారు. తెలంగాణకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర బీజేపీ నేతలు రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన చేయించాలన్నారు.