కాంగ్రెస్​ అగ్రనేతలకు అగ్ని పరీక్ష

కాంగ్రెస్​ అగ్రనేతలకు అగ్ని పరీక్ష

నల్గొండ, వెలుగు : రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్గొండ జిల్లాలో క్రమంగా బీఆర్ఎస్ ​పాగా వేసింది. ప్రస్తుతం జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ విజేతగా నిలిచిన రూలింగ్​ పార్టీ తన ప్రాబల్యాన్ని అంతకంతకూ పెంచుకుంటున్నది. రెండుసార్లూ పరాభవాన్ని మూటగట్టుకున్న హస్తం పార్టీ మునుగోడు బైపోల్​రూపంలో సిట్టింగ్ ​స్థానాన్ని పోగొట్టుకున్నది. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్​రెడ్డికి అగ్నిపరీక్షలా మారబోతున్నాయి. ఇన్నాళ్లూ జిల్లాలో ఊసే​లేని బీజేపీకి గతేడాది చివర్లో జరిగిన మునుగోడు ఎన్నికలు బూస్ట్ ​ఇచ్చాయి. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన రాజగోపాల్​రెడ్డి బీఆర్​ఎస్​కు గట్టిపోటీ ఇవ్వడంతో కమలం పార్టీలో జోష్​ నెలకొన్నది. కాగా, తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే మునుగోడులో బీఆర్ఎస్​ బయటపడిందని చెప్పుకుంటున్న కమ్యూనిస్టులు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలయెన్స్​ వైపు అడుగులు వేస్తున్నారు. 

సిట్టింగ్​లపై తీవ్ర వ్యతిరేకత..

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మిర్యాలగూడ మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వైఖరిపై ఇటు పార్టీలో, అటు ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ జరిపిన సర్వేలు, సొంత ఏజెన్సీలతో నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే తేలింది. ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగిలిన నలుగురు రెండు, మూడు సార్లు గెలుపొందిన వాళ్లే ఉన్నారు. సిట్టింగులకే మళ్లీ సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ​చెప్పగా, ఇదే జరిగితే కొన్ని చోట్ల ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవు. నల్గొండ, నకిరేకల్​, నాగార్జునసాగర్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో సొంత పార్టీ లీడర్లతో ఉన్న విభేదాలు ఎమ్మెల్యేలకు తీరని నష్టం కలిగించే అవకాశాలున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కేడర్​ను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. మరోవైపు ఇన్నాళ్లు ఆగిపోయిన అభివృద్ధి పనులను ఆగమేఘాల మీద కంప్లీట్ చేసి ఎన్నికల నాటికి ప్రజాదరణ పొందాలని ప్లాన్ ​వేస్తున్నారు.  

నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు 

ఎమ్మెల్యేలకు వర్గ పోరు

నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్, చాడ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ పిల్లి రామరాజు యాదవ్​తో సహా పలువురు జడ్పీటీసీ, ఎంపీపీలు పనిచేస్తున్నారు. నకిరేకల్​లో ఎమ్మెల్యే చిరుమర్తికి వ్యతిరేకంగా మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్యతో సహా పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు కార్యక్రమాలు చేపడుతున్నారు. నాగార్జునసాగర్​లో ఎమ్మెల్యే నోముల భగత్​కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఆయన వర్గీయులతో పాటు, హాలియా, నందికొండ మున్సిపల్ కౌన్సిలర్లు, తెలంగాణ ఉద్యమ కారులు పనిచేస్తున్నారు. దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్​కు వ్యతిరేకంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం పనిచేస్తోంది. ఇటీవల గుత్తా ప్రధాన అనుచరుడు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహాను పదవి నుంచి తప్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి. మరోవైపు ఎమ్మెల్యే వైఖరి నచ్చక పలువురు కీలక ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామాలు కూడా చేశారు. మునుగోడులో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా బైపోల్​లో పనిచేసిన వర్గం నేతలతో ఆయనకు పొసగడం లేదు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్​రావుకు వ్యతిరేకంగా మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్​ వర్గం పనిచేస్తోంది.

పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటం..

ప్రస్తుతం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ చేతిలోనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి పునర్​వైభవం తీసుకురావడం కాంగ్రెస్ ​దిగ్గజాలైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డిలకు అనివార్యమైంది.  ఈ గెలుపు మీదనే వారి రాజకీయ భవిష్యత్​కూడా ఆధారపడి ఉంటుందన్న వాదనలున్నాయి. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయి, భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈసారి నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. 2018 ఎన్నికలతో పాటు సాగర్  బైపోల్ లో ఓడిపోయిన జానారెడ్డి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది తేలలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన కొడుకు రఘువీర్ లేదా జయవీర్ పోటీకి సిద్ధమవుతున్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలపై తండ్రీ కొడుకులు ఫోకస్ పెట్టారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్ పోటీలో ఉండగా..నకిరేకల్, మునుగోడులో అభ్యర్థులు ఎవరనేది కోమటిరెడ్డి వెంకట రెడ్డి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు. అయితే...రేవంత్​రెడ్డి పీసీసీ చీఫ్​అయినప్పటి నుంచి పార్టీకి ఇబ్బంది కలిగేలా కామెంట్స్​చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పటి పరిస్థితిని బట్టి మారే అవకాశాలున్నాయి. మరోవైపు కాంగ్రెస్​కోటను బద్దలు కొట్టిన మంత్రి జగదీశ్​రెడ్డి వచ్చే ఎన్నికల్లో అనుసరించే వ్యూహం, అధిష్టానం వైఖరిపై కూడా అధికార పార్టీ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఇంకా బీఆర్ఎస్​కు కమ్యూనిస్టుల పొత్తుల పంచాయితీ ఉండడంతో ఇదోరకంగా కాంగ్రెస్​కే కలిసి వస్తుందనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో నెలకొంది. 

కొత్త లీడర్లు వస్తేనే బీజేపీ పట్టు బిగించేది.. 

ఉమ్మడి జిల్లాలో బీజేపీ ఆశలన్నీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైనే ఉన్నాయి. అయితే ఆయన పైనే ఆధారపడి జిల్లాలో మెజారిటీ సీట్లు గెలుచుకోవడం కష్టమే. రాజగోపాల్​రెడ్డి, బీజేపీపై ఉన్న నమ్మకంతో చరిష్మా కలిగిన లీడర్లు పార్టీలో చేరితే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్​రెడ్డి బీజేపీ తరపున పోటీ చేయడం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఓడిపోయినా గట్టి పోటీనే ఇచ్చింది. అప్పుడే భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీఆర్​ఎస్ ​నుంచి బీజేపీలో చేరడం తమకు ప్లస్​పాయింట్​అయ్యిందని ఆ పార్టీ నమ్ముతోంది. ఇది వచ్చే ఎన్నికల్లో సామాజికంగా తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఇప్పటికైతే నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో తమకు మంచి పట్టు ఏర్పడిందని, అయితే కోమటిరెడ్డి, బూరతోనే టార్గెట్ ​రీచ్ ​కావడం అసాధ్యమని ఆ పార్టీ గుర్తించింది. దీంతో సత్తా ఉన్న లీడర్ల కోసం వెతుకులాడుతోంది. దీని కోసం కాంగ్రెస్​లో గట్టి పట్టున్న లీడర్లను, అసంతృప్తులను ఆహ్వానించి పట్టు బిగించాలని చూస్తున్నది.  
కమ్యూనిస్టులకు మంచిరోజులు వచ్చేనా..?

మునుగోడులో బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోవడంతో తమకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టేనని కమ్యూనిస్టు నాయకత్వం నమ్ముతోంది. పొత్తులో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును సాధించుకోవాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ భువనగిరి ఎంపీ స్థానాన్ని అడిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్​లో పలువురు ఎమ్మెల్యేల స్థానాలు అటూ ఇటు అయ్యే ఛాన్స్​ ఉంటుంది. నల్గొండ ఎంపీ స్థానాన్ని ఇప్పటి వరకు బీఆర్ఎస్ గెలుచుకోలేదు. దీంతో ఈ ప్లేసులో పాగా వేసేందుకు ఈసారి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్​ను రంగంలోకి దింపే పరిస్థితి  కనిపిస్తున్నదని అంటున్నారు. ఇట్లయితే సీపీఐకి దేవరకొండ సీటు అప్పగించి, భువనగిరి ఎంపీ సెగ్మెంట్​లో కూడా బీఆర్ఎస్ పోటీకి దిగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రమావత్ రవీంద్ర కుమార్, దేవరకొండ ఎమ్మెల్యే
అనుకూల అంశాలు : 
* డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో సాగునీటి సమస్యకు పరిష్కారం
* కార్యకర్తలకు అందుబాటులో ఉండటం
* మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 
* ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలతో గిరిజన ప్రాంతాల్లో తాగు, సాగునీటి సౌకర్యం
 ప్రతికూల అంశాలు : 
* పార్టీ కేడర్​లో అసంతృప్తి
* మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో విభేదాలు
* ఎస్ఎల్​బీసీ టన్నెల్, నక్కలగండి, పెండ్లిపాకల ప్రాజెక్టుల్లో కదలిక లేకపోవడం
* స్వప్రయోజనాలకే ప్రియారిటీ ఇస్తున్నారనే విమర్శలు

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే 
అనుకూల అంశాలు : 

* నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడం
* బైపోల్​లో గెలిచాక రూ.400 కోట్లతో అభివృద్ధి
* శివన్నగూడెం, కిష్టరాయినపల్లి రిజర్వాయర్ల పనులపై ఫోకస్
* గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేయడం
* చండూరులో వంద పడకల దవాఖాన ఏర్పాటు
ప్రతికూల అంశాలు : 
* పార్టీలో అంతర్గత విభేదాలు
* ఒంటెత్తు పోకడ
* పార్టీ లీడర్లు,  ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత
* కేడర్, నాయకులతో దురుసు ప్రవర్తన  

కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే
అనుకూల అంశాలు :

* నల్గొండ టౌన్​ను సీఎం దత్తత తీసుకోవడం
* రూ.500 కోట్లతో నల్గొండలో అభివృద్ధి పనులు
* కార్యకర్తలకు అందుబాటులో ఉండటం
* అడిగినవారికి సీఎంఆర్​ఎఫ్​ ఇప్పించడం 
* నల్గొండ ఐటీ పార్కు, మెడికల్ కాలేజీ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పనులు
ప్రతికూల అంశాలు : 
* పార్టీ నాయకులు, సీనియర్ల మధ్య సమన్వయ లోపం
* పార్టీలో గ్రూపు రాజకీయాలు
* తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటు
* టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత  
చిరుమర్తి లింగయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే
అనుకూల అంశాలు :

* రూ.600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి  
* బ్రహ్మణ వెల్లంల, అయిటిపాముల ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి
* నకిరేకల్​లో వంద పడకల దవాఖాన నిర్మాణం 
ప్రతికూల అంశాలు :
* సొంత పార్టీలో మితిమీరిన గ్రూపు రాజకీయాలు
* మాజీ ఎమ్మెల్యే వీరేశం, మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్​తో విభేదాలు

* సీనియర్ నాయకులతో సఖ్యత లేకపోవడం
* స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత
నోముల భగత్, నాగార్జునసాగర్, ఎమ్మెల్యే
అనుకూల అంశాలు :

* రూ.150 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి
* ప్రత్యర్థి జానారెడ్డి వదిలిపెట్టిన సమస్యలపైన ఫోకస్
* డిగ్రీ కాలేజీ, లిఫ్ ఇరిగేషన్ స్కీంలు 
* నెల్లికల్లు, గుర్రంపోడు, డీ 8,9 లిఫ్టులతో చివరి భూములకు నీళ్లు 
* స్థానికంగా ఉండటం
ప్రతికూల అంశాలు : 
* సీనియర్లు, తెలంగాణ ఉద్యమకారులతో నిర్లక్ష్య ధోరణి
* ఎమ్మెల్సీ కోటిరెడ్డితో పడకపోవడం 
* హాలియా,నందికొండ మున్సిపాల్టీల్లో సమస్యలు
* సాగర్​లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించకపోవడం

నలమోతు భాస్కర్​రావు, మిర్యాలగూడ, ఎమ్మెల్యే 
అనుకూల అంశాలు :

* నియోజకవర్గ అభివృద్ధి 
* దామరచర్ల, మాడ్గులపల్లి మండలాల్లో రూ.667 కోట్లతో ఐదు లిఫ్ట్ స్కీంలు
* సాగర్, నల్గొండ రోడ్డు విస్తరణ పనులు  
* రూ.14 కోట్లు ప్రభుత్వ దవాఖాన ఆధునీకీకరణ
ప్రతికూల అంశాలు :
* కమ్యూనిస్టులకు మిర్యాలగూడ సీటు కేటాయిస్తారనే ప్రచారం
* వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి ‘రెడ్డి’ సామాజిక వర్గానికి  చెందిన వ్యక్తి అయితే గట్టి పోటీ