రేవంత్ మెదక్ కు రా.. అభివృద్ధి చూపిస్తన: హరీశ్ రావు

రేవంత్ మెదక్ కు రా.. అభివృద్ధి చూపిస్తన: హరీశ్ రావు

గజ్వేల్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి వస్తే, మెదక్​లో జరిగిన అభివృద్ధి చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్, మెదక్ జిల్లాలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఇప్పుడేమో ఇందిరాగాంధీ హయాంలోనే మెదక్ అభివృద్ధి జరిగిందని అంటున్నారు. మెదక్‌‌‌‌‌‌‌‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది.. రైల్వే లైన్, మూడు యూనివర్సిటీలు తెచ్చింది కేసీఆర్. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అది కేసీఆర్ చలవే. బీఆర్ఎస్ హయాంలోనే మెదక్ అభివృద్ధి జరిగింది. రేవంత్.. మెదక్​లో జరిగిన అభివృద్ధిని కళ్లు తెరిచి చూడు. లేదంటే నువ్వొస్తే నేను చూపిస్తా” అని హరీశ్​ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్​ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మీడియాతో హరీశ్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ‘‘సీఎం పదవిలో ఉన్న వ్యక్తి స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. ఆయన మమ్మల్ని ఎన్నోసార్లు వ్యక్తిగత దూషణలు చేశారు.  కానీ మేం అలా మాట్లాడం” అని హరీశ్​ పేర్కొన్నారు. 

రేవంత్ మాట మీద నిలబడడు.. 

‘‘రేవంత్.. నువ్వు మోదీతో కుమ్మక్కయింది నిజం కాదా? పార్టీలు మారినోళ్లపై తక్షణమే అనర్హత వేటు వేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. నువ్వేమో పార్టీలు మారినోళ్లకు కండువాలు కప్పుతున్నావ్” అని హరీశ్​ ప్రశ్నించారు. ‘‘వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చేయలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. కొడంగల్​లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి చేయలేదు. మాట మీద నిలబడే నైజం రేవంత్ రెడ్డికి లేదు” అని విమర్శించారు. బీసీలు, ఎస్సీలను కాంగ్రెస్ మోసం చేసిందని.. మైనార్టీలకు కేబినెట్‌‌లో అవకాశం కల్పించలేదని హరీశ్​ మండిపడ్డారు. 

రైతులను పట్టించుకోవడం లేదు

రైతులు గోస పడుతున్నా సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని హరీశ్ మండిపడ్డారు. ‘‘వడగండ్ల వానలకు పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు సెంటర్లలో వడ్లు కొనడం లేదు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలి. పంట నష్టపరిహారం ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. ‘‘వందలాది మంది భూములను వెంకట్రామిరెడ్డి లాక్కున్నాడని రేవంత్ అంటున్నారు.. అలా చేస్తేనే కదా లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించింది. మల్లన్నసాగర్ కట్టడం వల్లే కదా నీరు అందింది. అదే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్​కు నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు కదా. ఇండియాలోనే బెస్ట్ ఆర్అండ్ఆర్ కాలనీ కట్టింది వెంకట్రామిరెడ్డి” అని హరీశ్​ అన్నారు.