
- స్పీకర్‌కు జగదీశ్ రెడ్డి వినతిపత్రం
హైదరాబాద్, వెలుగు: అన్యాయంగా తనను సభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్పీకర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన సస్పెన్షన్‌కు సంబంధించి అధికారిక బులెటిన్ ఇవ్వాలని స్పీకర్‌కు జగదీశ్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. తనను సస్పెండ్ చేసి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అధికారిక బులెటిన్ ఇవ్వకపోవడం ఏంటన్నారు. వారం రోజుల నుంచి దాని గురించి అడుగుతున్నా సరిగ్గా స్పందించడం లేదన్నారు. కాగా, అంతకుముందు అసెంబ్లీ లాబీలోకి వచ్చిన జగదీశ్ రెడ్డిని చీఫ్ మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో సస్పెండ్ చేసినట్టు బులెటిన్ చూపించాలని చీఫ్ మార్షల్‌ను ఆయన ప్రశ్నించారు.
ఏ కారణంతో సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. అసెంబ్లీని పద్ధతి ప్రకారం నడపడం లేదన్నారు. ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని మండిపడ్డారు. మందబలంతో సభ నడుపుతామంటే కుదరదన్నారు. నల్గొండ జిల్లా మంత్రులు చిన్న కార్యక్రమమైనా హెలికాప్టర్లో తిరుగుతున్నారని, జాన్‌పహాడ్ దర్గాలో జానారెడ్డి ఇచ్చిన దావత్‌కు కూడా హెలికాప్టర్లోనే వెళ్లారన్నారు. కాగా, అంతకుముందు రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. హరీశ్ రావు నేతృత్వంలోని పార్టీ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభలోకి వెళ్లారు. రుణమాఫీపై చర్చించాలంటూ స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని అందించారు.