
మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం ఎక్కువైందని, ఆయన బట్టలిప్పే వరకు వదలబోనని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్ రావు అడ్రస్ లేకుండా చేస్తానని హెచ్చరించారు. మెదక్ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ పోటీ చేస్తారని చెప్పారు. ఆగస్ట్ 21వ తేదీ తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు.
‘ట్రంకు డబ్బా, రబ్బరు చెప్పులతో వచ్చిన నీకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్..రాజకీయంగా ఎంతో మందిని అణిచి వేశావ్. మల్కాజ్ గిరిలో నేను పోటీ చేస్తాను. రాజకీయాలు పక్కన పెట్టైనా మెదక్ లో మా అబ్బాయిని ఎమ్మెల్యే ను చేస్తా’ అంటూ ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలు ఆయన పార్టీ మారబోతున్నారా..? అన్న చర్చకు తెరలేపాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాను.. మైనంపల్లి హనుమంతరావు తలచుకుంటే ఏం జరుగుతుందో మంత్రి హరీశ్ రావును చూపిస్తానంటూ శపథం చేశారు. సిద్దిపేటలో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ ఘాటుగా స్పందించారాయన.
హరీష్ రావుకి మెదక్ సీటు కీప్ అట ?? #mynampally #harishrao #siddipet #medak pic.twitter.com/bvHoIGZp1C
— Revanth Sainyam Telangana (@Revanth_Sainyam) August 21, 2023