హైదరాబాద్, వెలుగు: నీట్‌పై జరుగుతున్న పోరాటంలో అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్ట కాల్చుకుంటా నిప్పు ఉందా అన్నట్టుగా సీఎం, మంత్రుల వ్యవహారశైలి ఉందని తెలిపారు. నీట్‌పై నిరసన తెలిపే హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి బీఆర్‌ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.
నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాల్సిందేనని పేర్కొన్నారు. దాంతోపాటు టీజీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల తారుమారుకు పూర్తి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అన్నప్పుడు.. రేవంత్‌ను మాత్రం ఎందుకు అడగరని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన లాఠీచార్జ్‌కు ఒక న్యాయం.. హైదరాబాదులో నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జ్‌కు ఇంకో న్యాయమా అని మండిపడ్డారు.
